కరోనా కారణంగా ఇండియాలో ఓటీటీ మార్కెట్ అనూహ్యంగా పెరిగింది. కొత్త సినిమాలు వెబ్ సిరీస్‌లు హిందీ ఇంకా ఇతర ఇండియన్ భాషల్లో వస్తున్నాయి. పెద్ద ఎత్తున వస్తున్న ఈ వెబ్ సిరీస్‌లకు ప్రేక్షకులు మెల్ల మెల్లగా ఆకర్షితులు అవుతున్నారు. ఇండియాలో ఓటీటీ ఏ స్థాయిలో ఉందో తాజాగా దిల్ బేచారా వ్యూస్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చు. కేవలం 24 గంటల్లో ఓటీటీలో ఈ చిత్రాన్ని పది కోట్ల మంది చూశారు. అంటే ఇండియాలో ఓటీటీ యూజర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనుక ఈ సమయంలో బాలీవుడ్ ప్రముఖుల నుండి టాలీవుడ్ సెలబ్రెటీల వరకు అంతా కూడా వెబ్ సిరీస్‌ల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకులు కూడా ఓటీటీ కంటెంట్‌ను క్రియేట్ చేసేందుకు ముందుకు వస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు తేజ ఓటీటీ లో ఒక వెబ్ సిరీస్‌ను త్వరలో స్ట్రీమింగ్ చేయబోతున్నాడు. నెట్ ఫ్లిక్స్ కోసం ఈయన వెబ్ సిరీస్‌ను తీస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్‌లో బిగ్ బాస్ స్టార్ నందిని రాయ్ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఆమె అందాలతో వెబ్ సిరీస్‌ను హాట్‌గా తేజ తెరకెక్కిస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. ఆకట్టుకునే కథనంతో పాటు మంచి బోల్డ్ కంటెంట్‌ను ఈ చిత్రంలో చూపించబోతున్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన చర్చలు ఇప్పటికే పూర్తి అవ్వడంతో పాటు షూటింగ్‌ను కూడా మొదలు పెట్టారు. కొంత భాగం ఈ లాక్ డౌన్లోనే షూటింగ్ చేశారు. ప్రస్తుతం ఇతర ఎపిసోడ్స్ చిత్రీకరణ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేస్తారట.
తేజ గతంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. ముఖ్యంగా ఈయన సినిమాలు యూత్‌ను టార్గెట్ చేసి ఉంటాయి. కనుక ఈ చిత్రం కూడా బోల్డ్ గా యూత్ సెంట్రిక్‌గా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్‌తో పాటు దర్శకుడు తేజ అలివేలుమంగ వెంకటరమణ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రంలో గోపీచంద్ హీరోగా నటించబోతున్నాడు. హీరోయిన్స్‌గా కీర్తి సురేష్ మరియు కళ్యాణి ప్రియదర్శన్ నటించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి అయిన తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. నేనే రాజు నేనే మంత్రి చిత్రం తర్వాత దర్శకుడు తేజ కెరీర్ మళ్లీ గాడిన పడ్డట్లయ్యింది. ఇలాంటి సమయంలో తేజ వెబ్ కంటెంట్ పై దృష్టి పెట్టడం చర్చనీయాంశంగా ఉంది.