కరోనా కారణంగా ఆరు నెలల క్రితం మూత పడ్డ థియేటర్లు ఇంకా తెరచుకోలేదు. సెప్టెంబర్ 1 నుండి ఖచ్చితంగా థియేటర్లకు అన్ లాక్ చేస్తారని అంతా అనుకున్నారు. కాని మరో నెల రోజుల పాటు థియేటర్ల కోసం వెయిట్ చేయాల్సి రావచ్చు అంటున్నారు. అక్టోబర్ లేదా నవంబర్ లో థియేటర్లు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
ఇలాంటి సమయంలో సురేష్ బాబు మాత్రం తాను ఇప్పట్లో సినిమాలు చేయను అలాగే థియేటర్లు ఓపెన్ చేయను అంటూ ఓపెన్ గా చెప్పేస్తున్నాడు. ఈ విషయంలో ఎవరితో నాకు సంబంధం లేదు. కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు నేను షూటింగ్స్ ప్రారంభించను. అలాగే నా ఆధీనంలో ఉన్న థియేటర్లను ఓపెన్ చేయను అంటూ పేర్కొన్నాడు. గతంలోనే సురేష్ బాబు ఈ ప్రకటన చేశాడు.
ఇప్పుడు ఆయన మాట ఏమైనా మారిందా అంటే అదే మాట మీద ఆయన ఉన్నాడు. తనలో ఎలాంటి మార్పు లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. జనవరి వరకు థియేటర్లను ఓపెన్ చేయకుంటేనే బాగుంటుందని కేంద్రం కూడా భావిస్తుందట. కాని కొందరు సినీ ప్రముఖులు ఈ విషయంలో ఒత్తిడి తెస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అందుకే ఓపెన్ చేసేందుకు సిద్దం అవుతున్నారట. అది కూడా ఇప్పుడు కాదు కాస్త ఆలస్యంగా.
సంక్రాంతికి సినిమాలు రెడీ చేసుకునేందుకు కొందరు షూటింగ్స్ కు వెళ్తున్నారు. అయితే కొందరు మాత్రం నిదానంగా సంక్రాంతి తర్వాత షూటింగ్ కు వెళ్దామని భావిస్తున్నారు. అందులో సురేష్ బాబు ఒకరు. ఆయన బ్యానర్ లో రూపొందుతున్న దాదాపు అయిదు ఆరు సినిమాలు కూడా షూటింగ్ వచ్చే ఏడాదిలోనే పూర్తి కాబోతున్నాయి. ఇక సినిమాలు కూడా వచ్చే ఏడాదిలో విడుదల చేసే అవకాశం ఉంది.