సినీరచయితల్లో ఏ రచయితకూ దక్కని అదృష్టం అనతికాలంలోనే సాయిమాధవ్ బుర్రా సొంతమైంది..
ఓ విధంగా దీన్ని అతని ఘనతగా కూడా చెప్పొచ్చు వివరాల్లోకెళ్తే..
తెలుగు సినిమా పుట్టాక ఎందరో మహారచయితలు తమ అక్షరాలతో తెలుగు సినిమాను పునీతం చేశారు..
అయితే.. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రకం, సోషియో ఫాంటసీ ఇలా అయిదు జానర్ల చిత్రాలకూ మాటలు రాసిన క్రెడిట్ మాత్రం వెంపటి సదాశివ బ్రహ్మంగారికి మాత్రమే దక్కింది.. చారిత్రక కథాంశమైన ‘పలనాటియుద్ధం'(1947), జానపద కథాంశమైన ‘కీలుగుర్రం'(1949), పౌరాణిక కథాంశమైన ‘చెంచులక్ష్మి'(1958), సొషియో ఫాంటసీ కథాంశమైన ‘దేవాంతకుడు’ (1960).. చిత్రాలను ఉదాహరణగా చెప్పొచ్చు..
ఆయన తర్వాత.. సముద్రాల సీనియర్, పింగళి, ఆత్రేయ ఒక్క సొషియో ఫాంటసీ మినహా మిగిలిన నాలుగు జానర్లకూ మాటలు రాశారు.. ముళ్లపూడి వెంకటరమణగారైతే జానపదం మినహా అన్నీ జానర్లూ టచ్ చేశారు..
తర్వాత ఆ తర్వాత సినిమా కథల పోకడలలో మార్పురావడం.. సాంఘిక కథలు మాత్రమే రాజ్యమేలటం.. ఈ మార్పుల వల్ల , మాటల రచయితలకు రకరకాల జానర్లలో మాటలు రాసే అవకాశం, అదృష్టం మిస్ అయింది..
అయితే.. రచయిత సాయిమాధవ్ మాత్రం అనతికాలంలోనే ఏ రచయితకీ లేని ఘనతను సాధించారు.. తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఏ రచయితా రాయనన్ని జానర్లలో మాటలు రాసి రికార్డు సృష్టించారు.. ఆ రికార్డు కూడా పదేళ్లలో సాధించడం చెప్పుకోదగ్గ విషయం..
‘శాకుంతలం’… సాయిమాధవ్ రాసిన తొలి పౌరాణికం..
‘ హరిహర వీరమల్లు’ సాయిమాధవ్ రాసిన తొలి జానపదం..
గౌతమీపుత్ర శాతకర్ణి, సైరా.. సాయిమాధవ్ రాసిన చారిత్రాత్మక చిత్రాలు..
గోపాలాగోపాలా, సాక్ష్యం.. సాయిమాధవ్ రాసిన సొషియో ఫాంటసీ చిత్రాలు..
ఇక సాంఘిక చిత్రాలు ఓ ఇరవై ఉంటాయ్..
ఈ అయిదు జానర్లతోపాటు..
మహానటి, కథానాయకుడు, మహానాయకుడు, బెంగళూరు నాగరత్నమ్మ చిత్రాలకు మాటలు రాసి ఏ సినీ రచయితకీ లేని ఘనతని సొంతం చేసుకున్నారు సాయిమాధవ్..
రాబోతున్న రాజమౌళీ ‘RRR’ కూడా కొత్త జానరే.. దానికీ సాయిమాధవే మాటలు..
రచయితగా ఎవరికీ రాని అవకాశాలు తనకు రావడం.. వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవడం.. ఇదంతా అదృష్టం తో పాటు సాయిమాధవ్ కృషి , ఘనతకు నిదర్శనం ..