మెగాస్టార్ చిరంజీవి తన వయసుకు తగ్గ సినిమాలు చేయాలని, పాత్రలను ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసీఫర్‌ను ఎంపిక చేసుకున్నాడు. ఆ సినిమాలో మోహన్‌లాల్ పోషించిన పాత్ర చాలా హుందాగా ఉండటంతో పాటు ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అందుకే ఆ పాత్రపై మోజు పడ్డ చిరంజీవి లూసీఫర్ ను తెలుగులో రీమేక్ చేయాలని భావించాడు. ఆ రీమేక్ బాధ్యతలను సాహో దర్శకుడు సుజీత్‌కు అప్పగించారు. దాదాపుగా మూడు నెలల పాటు కష్టపడి సుజీత్ లూసీఫర్ తెలుగు రీమేక్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఆ స్క్రిప్ట్‌ను పరిశీలించిన చిరంజీవి పూర్తిగా నిరుత్సాహ పడ్డాడట. దాంతో ఆ సినిమా నుండి సుజీత్‌ను తప్పించేశారు అంటూ కొన్ని రోజుల క్రితం పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరిగింది.
ఇప్పుడు అది నిజమే అన్నట్లుగా ఒక సంఘటన జరిగింది. ఈ లాక్ డౌన్ టైం అయినా కూడా మెగాస్టార్ చిరంజీవి మరియు వి వి వినాయక్ కలిశారు. వీరిద్దరు కలయిక వెనుక కారణం ఏంటీ అంటే ప్రతి ఒక్కరు చెబుతున్న కారణం లూసీఫర్. ఆ రీమేక్ నుండి సుజీత్‌ను తప్పించడంతో ఆ స్థానంను వినాయక్‌తో భర్తీ చయబోతున్నారు. పరుచూరి బ్రదర్స్‌తో పాటు మరికొందరు రచయితలు మరియు దర్శకులతో కలిసి వినాయక్ లూసీఫర్ కోసం స్క్రిప్ట్‌ను రెడీ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా వినాయక్‌కు తెలియజేశాడు. ఒక టీమ్‌ను ఏర్పాటు చేసి స్క్రిప్ట్ పనులు అప్పగించారు. అన్ని ఓకే అయితే వచ్చే ఏడాదిలో సినిమాను పట్టాలెక్కించాలనే నిర్ణయానికి మెగాస్టార్ మరియు మేకర్స్ వచ్చారు.
ప్రస్తుతం చిరంజీవి ఆచార్య చిత్రాన్ని చేస్తున్నాడు. కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పటికే ఆచార్య చిత్రం 40 శాతం షూటింగ్ పూర్తి అయ్యింది. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆచార్య చిత్రం కోసం భారీ ఎత్తున ఒక దేవాలయం సెట్‌ను వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ సెట్‌లో సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో సినిమాను పున: ప్రారంభించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఆచార్య తర్వాత వినాయక్ దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్‌ను చిరంజీవి చేస్తాడని అనధికారిక సమాచారం.