తెలుగు సినీ పరిశ్రమలో చక్కటి అభిరుచి ఉన్న నిర్మాతల్లో లక్కీ మీడియా అధినేత బెక్కం వేణుగోపాల్ ఒకరు. టాటా బిర్లా మధ్యలో లైలా వంటి సూపర్‌హిట్ సినిమాతో నిర్మాతగా కెరీర్ పెట్టి ఎన్నో మంచి హిట్ చిత్రాలను ప్రేక్షకులకి అందించారు. ప్రస్తుతం విశ్వక్ హీరోగా ప్రముఖనిర్మాత దిల్‌రాజుతో కలిసి `పాగల్` సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ 27 పుట్టినరోజు సందర్భంగా నిర్మాత బెక్కం వేణుగోపాల్ ఇంటర్వ్యూ.
ఈ సంవత్సరం మీ బర్త్‌డే ప్లాన్స్ ఏంటి?
– 2020లో కూడా నా బర్త్‌డే టైమ్‌లో లాక్‌డౌన్ ఉంది. ఈ సంవత్సరం పరిస్థితులు ఇంకా బాలేవు. ఇలాంటి కష్టసమయంలో సినిమాలు ,రిలీజ్‌లు ఇవన్ని ప్రక్కన పెట్టి అందరం బతకాలనే ఉద్దేశ్యంతో నా స్నేహితులు, బందువులు ఇలా తెలిసిన వారందరికీ ఫోన్ చేసి కరోనా గురించి, వ్యాక్సిన్ ప్రాముఖ్యత గురించి చెబుతున్నాను. గత వారం రోజులుగా ఇదే చేస్తున్నాను.
మీ లైఫ్‌లో బర్త్‌డేకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది?
– నేను నా పుట్టనరోజుకి ప్రత్యేకంగా ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వను. నేను సినిమా మనిషిని, నా ధ్యాసంతా సినిమా మీదే ఉంటుంది. సెట్లో ఉంటే మా టీమ్, మీడియా వారితో కలిసి కేక్ కట్ చేసిపుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకునేవాడిని. అంతే కాని పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ అయితే ఏమీ ఉండవు. ఈ సంవత్సరం కూడా `పాగల్` రిలీజ్‌టైమ్‌లో బర్త్‌డే వస్తుంది అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను కాని ఇప్పుడు బయట పరిస్థితులు చూస్తుంటే కేక్ కూడా కట్‌చేయాలి అనిపించడంలేదు. ఎందుకంటే ఇది కేవలం మనం మాత్రమే అనుభవిస్తున్న బాధ కాదు ప్రపంచం అంతా కరోనాపై పోరాడుతూనే ఉంది. నాకు ఊహ తెలిసిన దగ్గరనుండి నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ తో తర్వాత నిర్మాతనయ్యాక సినిమా యూనిట్, మీడియా ఇలా అందరితో సెలబ్రేట్ చేసుకున్నాను కాని ఇది ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్.
రిలీజ్‌డేట్ అనౌన్స్ చేశాక పాగల్ సినిమా వాయిదా వేయాల్సి వచ్చింది కదా ఎలా అన్పిస్తుంది?
– గతేడాది మార్చి19న సినిమా ఓపెనింగ్ జరిపాం…వెంటనే మార్చి22న లాక్‌డౌన్ స్టార్టయ్యింది. తర్వాత నవంబర్ 1నుండి షూటింగ్ మొదలుపెట్టాం. షూటింగ్ పూర్తి చేసి, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఫస్ట్ కాపీ కూడా రెడీ చేశాం. మళ్లీ కరోనా సెకండ్ వేవ్ రూపంలో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో విడుదల తేదిని వాయిదా వేయాల్సి వచ్చింది. ఒక ఎగ్జైట్‌మెంట్‌తో సినిమా చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఔట్ పుట్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పటివరకూ సినిమా చూసిన వాళ్లందరూ కన్ఫర్మ్ హిట్ అన్నారు. ఇలాంటి సందర్భంలో సినిమా వాయిదా పడడం ఎవరికైనా కొంత బాధ కలిగిస్తుంది.
లక్కీ మీడియా సంస్థ ప్రారంభించి 15 సంవత్సరాలు పూర్తయ్యింది కదా ఈ జర్నీ ఎలా అనిపించింది?
– నా వరకూ మొన్ననే కదా `టాటా బిర్లా మధ్యలో లైలా` తీసింది..అప్పుడే 15సంవత్సరాలు పూర్తయ్యాయా అనిపిస్తుంది. ఆ సినిమాతో నిర్మాతగా ప్రయాణం మొదలుపెట్టిన దగ్గరనుండి ప్రతిరోజు ఉదయాన్నే ఆఫీస్‌కి వెళ్లడం ఉన్న సినిమాలు ఎలా పూర్తిచేద్దాం, నెక్స్ట్ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేద్దాం ఇలా ఆలోచిస్తూ తెలియకుండానే 15 సంవత్సరాలు గడిచింది. నా ఉద్దేశ్యంలో ఇది ఒక గొప్ప జర్నీ. ఎందుకంటే చాలా మంది గొప్ప వ్యక్తులతో కలిసి ట్రావెల్ అయ్యాను. మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్ అయ్యాను. ఒక నిర్మాణ సంస్థను నెలకొల్పి 15 సంవత్సరాలుగా కంటిన్యూగా సినిమాలు తీస్తున్నందుకు లక్కీగా ఫీలవుతున్నాను. నా ఫ్యామిలీ మరియు ఎంతో మంది నా ఫ్రెండ్స్ సపోర్ట్‌తో నా జర్నీ ముందుకెళ్తుంది.
హుశారు తర్వాత కొంచెం ఎక్కువ గ్యాప్ తీసుకున్నారు..?
– హుశారు తర్వాత వెంటనే పాగల్ సినిమా అనౌన్స్ చేశాను. అయితే మధ్యలో హీరో మరో సినిమా చేయాల్సివచ్చింది. ఆ సినిమా పూర్తికాగానే పాగల్ సినిమా మొదలుపెట్టాం. తర్వాత ఒక సంవత్సరం కాలం ఎలా గడిచిందో మనందరికీ తెలిసిందే..ఇది మాములుగా వచ్చిన గ్యాపే కాని కరోనా వల్ల చాలా గ్యాప్ వచ్చింది అనిపిస్తుంది.
పాగల్ సినిమా ఎలా ఉండబోతుంది?
– ఫ్యామిలీ ఎమోషన్స్, మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. నవరసాలు కలిపి ఉన్న సినిమా. చిన్న పిల్లల దగ్గరనుండి పెద్దవాళ్ల వరకూ ఫ్యామిలీ అంతా కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా ఇది. దర్శకుడు నరేష్ కి ఫస్ట్ సినిమా అయినా చాలా బాగా తెరకెక్కించాడు. మా హీరో విశ్వక్ సేన్‌ది సింగిల్ హ్యాండ్ పెర్‌ఫామెన్స్ అని చెప్పొచ్చు. హీరోయిన్ నివేధా పేతురాజ్, అలాగే మురళి శర్మ ఇలా ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారు. మణికందన్ అద్భతమైన ఫోటోగ్రఫి ఇచ్చారు. రధన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా టీమ్ అందరూ ఎలాగైన ఒక మంచి సినిమా చేయాలని డిసైడ్ అయ్యి కసితో చేసిన చిత్రమిది. ఔట్‌పుట్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాం.
దిల్‌రాజుగారితో అసోసియేషన్ గురించి?
– దిల్‌రాజుగారు ఒక లెజెండ్. ఒక అన్నగా, గురువుగా నాకు ఆయన ఇన్స్‌పిరేషన్. దిల్‌రాజుగారితో కలిసి ట్రావెల్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. ఆయన దగ్గరనుండి చాలా విషయాలు నేర్చుకున్నాను అది నా లైఫ్‌లో దొరికిన ఒక వరం. ఫస్ట్ నుండి లాస్ట్ వరకూ ఆయన ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టే ఈ రోజు `పాగల్` సినిమా ఇంతబాగా వచ్చింది.
మీ జర్నీ ఇలానే కంటిన్యూ అవుతుందా?
– హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది. ఎవ్వరి దిష్టితగలకుండా మా జర్నీ ఇలానే కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.దిల్‌రాజుగారితో ప్రొఫెషనల్‌గా జర్నీ చేసే అవకాశం వచ్చినందుకు నేను చాలా లక్కీగా ఫీలవుతున్నాను. మా జర్నీ ఇంకా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగాలని ఆశిస్తున్నాను..
ఈ కరోనా తర్వాత ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు వస్తాయి అనుకుంటున్నారు?
– ఒక సారి అందరూ వ్యాక్సిన్ వేయించుకుని సేఫ్ అని ఫీలయినప్పుడు డెఫినెట్‌గా అందరూ థియేటర్స్‌కి వస్తారు. ఒకసారి కరోనా భీభత్సం తర్వాత థియేటర్స్ ఓపెన్ చేయగానే ఎలాంటి కలెక్షన్స్ వచ్చాయో మొన్ననే మనం చూశాం. మళ్లీ సెకండ్ వేవ్ తర్వాత కూడా అవి అలానే కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే సినిమా అనేది ఎంటర్‌టైన్‌మెంట్‌కి లాస్ట్ ఆప్షన్. దానికి ప్రత్యామ్నాయం ఉండదు.
ఈ పదిహేనేళ్ల జర్నీలో మీకు బాగా సంతృప్తినిచ్చిన సినిమా ఏది?
– ఇప్పటి వరకూ నేను చేసిన అన్ని సినిమాలు నాకు డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌లు ఇచ్చాయి. దాదాపు అన్ని సినిమాలు సక్సెస్‌ఫుల్‌గానే వెళ్లాయి కాబట్టి నా ప్రతి సినిమా ఓ కొత్త అనుభవాన్ని ఇచ్చింది. నేను ఏ సినిమా కూడా ఫ్లోలో చేయలేదు.. ప్రతి సినిమాకి అంతే టైమ్ తీసుకుని, అంతే కష్టపడి చేశాను. కాకపోతే కొన్ని సినిమాలు ఎక్కువ ప్రజాదరణ, కొన్ని సినిమాలు తక్కువ ప్రజాదరణ పొందవచ్చు. కాని నేను పడ్డ కష్టం మాత్రం అదే. కాబట్టి ఇప్పటివరకూ నేను తీసిన అన్ని సినిమాలు నా ఫేవరేట్ సినిమాలే..ప్రస్తుతం శ్రీవిష్ణు హీరోగా ఒక సినిమా అలాగే రీసెంట్‌గా బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్ తో ఒక సినిమా ప్రారంభించాం. ఈ కరోనా ప్రభావం తగ్గగానే `పాగల్` సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం.
ఈ కరోనా సమయంలో ప్రజలకి ఏం చెప్తారు?
– ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మళ్లీ సాదారణ స్థాయికి వచ్చే వరకూ ఎవరికి వారు జాగ్రత్తగా ఉండడంతో పాటు మన ప్రక్కవారికి, మన ఫ్యామిలీని జాగ్రత్తగా ఉంచాల్సిన భాధ్యత ఎంతైనా ఉంది. తప్పనిసరిగా మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడడం మర్చిపోవద్దు. వీటితో పాటు మానసికంగా కూడా బలంగా ఉండాలి అప్పుడే ధైర్యంగా ఈ పరిస్థితుల్ని ఎదుర్కోగలం. ముఖ్యంగా ఈ సెకండ్‌వేవ్ యువతపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి యాత్ జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా తీసుకుని ఈ కరోనాపై ఫైట్ చేయాలి. అల్రెడీ ఒకసారి ఫైట్ చేశాం కాబట్టే కరోనా తగ్గింది. అందరం కలిసికట్టుగా ఉంటే త్వరలోనే మళ్లీ పాత రోజులు వస్తాయి. ప్రభుత్వం అంటే ప్రజలు, ప్రజలు అంటే ప్రభుత్వం కాబట్టి వారు ఎలా చేస్తున్నారు ..అనేదానికంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాం అనేది ముఖ్యం. `నువ్వు తలుచుకుంటే నీకు కరోనా రాకుండా ఆపగలవు` కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను.