- గేయరచయిత శ్రీమణి
- ‘రంగ్ దే’లో ప్రతి పాటా నాకో ఛాలెంజే
- అన్ని పాటలకూ మంచి సందర్భాలు కుదిరాయి
స్వల్ప కాలంలోనే తెలుగు చిత్రసీమపై తనదైన ముద్ర వేసిన గేయరచయిత శ్రీమణి. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు పూర్తవుతున్న సందర్భం ఇది. నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశి నిర్మించిన ‘రంగ్ దే’ మూవీలోని నాలుగు పాటల్నీ ఆయనే రాశారు. రాక్‌స్టార్ దేవి శ్రీప్రసాద్ సంగీత స్వరాలు కూర్చిన ఈ పాటలు ప్రస్తుతం సంగీత ప్రియుల నోళ్లపై నానుతున్నాయి. మార్చి 26న ‘రంగ్ దే’ మూవీ విడుదలవుతోంది. ఈ సందర్భంగా పాటల మేస్త్రి శ్రీమణితో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు…
- డైరెక్టర్ వెంకీ సినిమా కథ చెప్పి పాటలు రాయించుకుంటారా? లేక సందర్భం చెప్పి రాయించుకుంటారా?
- ‘తొలిప్రేమ’ నుంచే డైరెక్టర్ వెంకీ అట్లూరితో కలిసి పనిచేస్తున్నాను. ఆయనతో ఏర్పడిన సాన్నిహిత్యం వల్ల ఒక్కోసారి కథ మొత్తం చెప్తారు, ఒక్కోసారి పాట వచ్చే సందర్భం చెప్తారు. ఆయన మంచి రైటర్. అందువల్ల గేయరచయితకు చాలా స్వేచ్ఛనిస్తారు. ఒక గిరి గీసుకొని అందులోనే ఉండరు. దాంతో లిరిక్స్ బాగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆయన పాట కోసం మంచి సందర్భాలను సృష్టిస్తారు. ‘రంగ్ దే’ మూవీలో అన్ని పాటలకూ మంచి సందర్భాలు కుదిరాయి.
- ‘రంగ్ దే’ ఆల్బమ్ గురించి ఏం చెబుతారు?
- ఒక ఆల్బమ్‌లో ఒకదానికొకటి భిన్నంగా అనిపించే పాటలు ఉండటం అరుదుగా జరుగుతుంటుంది. దేవి శ్రీప్రసాద్ గారు ఆల్బమ్‌లోని పాటల్ని డిఫరెంట్ వేరియేషన్స్‌తో ఉండేందుకు ప్రయత్నిస్తారు. ‘రంగ్ దే’ ఆల్బమ్ అలాంటిదే. నాలుగు పాటలు నాలుగు రకాలుగా ఉండి అలరిస్తున్నాయి.
- మీరెక్కువ ట్యూన్స్‌కు పాటలు రాస్తుంటారా? లేక మీరు పాటలు రాశాక మ్యూజిక్ డైరెక్టర్స్ ట్యూన్స్ కడుతుంటారా?
- సాధారణంగా మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చే ట్యూన్స్‌కే మేం లిరిక్స్ రాస్తుంటాం. ఒక్కోసారి పాట కాన్సెప్ట్ అనుకున్నప్పుడు ఆ కాన్సెప్టుకు తగ్గ లిరిక్స్ రాసుకొని, ఆ తర్వాత ట్యూన్స్ కట్టడం జరుగుతుంది. ‘రంగ్ దే’లో రెండు పాటలు ట్యూన్స్‌కు లిరిక్స్ రాస్తే, రెండు పాటలకు కాన్సెప్ట్ అనుకొని లిరిక్స్ రాశాక, ట్యూన్స్ కట్టారు. “నా కనులు ఎపుడు” అనేది క్లాసికల్ కంపోజిషన్. అలాంటి పాటకు ట్యూన్స్ కట్టాక రాస్తేనే బాగుంటుంది. అలాగే “బస్టాండే” సాంగ్ సందర్భాన్ని బట్టి ఈజీగా లిరిక్స్ రాసేయొచ్చు.
- దేవి శ్రీప్రసాద్‌తో పనిచేయడం ఎలా ఉంటుంది?
- దేవిగారు సాంగ్ పర్పస్‌ను బాగా చూస్తారు. ఆ పర్పస్ తెలిస్తే ట్యూన్స్ బాగా వస్తాయని ఆయన నమ్ముతారు. స్వతహాగా ఆయన రైటర్ కూడా కాబట్టి ట్యూన్స్ కట్టేటప్పుడే కొన్ని పదాలు ఆయన అనుకుంటారు. వాటిని ఉపయోగించుకొని మేం పాటలు అల్లేస్తుంటాం. ‘100% లవ్’ సినిమాతో ఆయనతో నా ప్రయాణం మొదలైంది. ఈ ఏప్రిల్‌తో మా ప్రయాణానికి పదేళ్లు పూర్తవుతాయి.
- ఛాలెంజింగ్ అనిపించిన పాటలు రాశారా?
- నేనైతే ప్రతి పాటనూ ఓ ఛాలెంజ్‌గానే తీసుకుంటాను. ఇప్పటికి మన సినిమాల్లో ఎన్నో ప్రేమ పాటలు వచ్చాయి. వాటిని దాటి ఒక అడుగు ముందుకు వేసేలా పాట రాయాలని తపిస్తుంటాం. అలాంటి పదాలతో పాట రాయడం ఛాలెంజే కదా. ‘రంగ్ దే’కి రాసినవన్నీ అలాంటి పాటలే.
- టైమ్‌కు పాట ఇవ్వాలనే ఒత్తిడిని ఎలా అధిగమిస్తుంటారు?
- సినిమా ఇండస్ట్రీలో టైమ్‌కు వర్క్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఆ ఒత్తిడి ఏ రైటర్‌కైనా ఉంటుంది. అలాంటి ఒత్తిడిలో పని చేయడం వల్ల మంచి ఔట్‌పుట్ వస్తుందనేది నా అభిప్రాయం. టైమ్‌లోగా ఇవ్వాలనే ఒత్తిడిలోనే ఎన్నో మంచి పాటలు పుడుతుంటాయి. కొన్ని పాటలు పుట్టడానికి చాలా తక్కువ టైమ్ పుడుతుంది. ఒక్కోసారి పాట రావడానికి రెండు నెలల సమయం కూడా తీసుకుంటుంది. ‘రంగ్‌దే’ పాటలకు నేనెక్కువ టైమ్ తీసుకోలేదు. దేవిగారి వల్ల నా పని ఈజీ అయిపోయింది.
- ఓ పాట రాసినప్పుడు మొదటగా ఎవరికి వినిపిస్తారు?
సాధారణంగా నేను ఓ పాట రాస్తే మొదట నా భార్యకు లేదంటే నా ఫ్రెండ్ మురళికి, రైటర్ తోట శ్రీనివాస్‌కు వినిపిస్తుంటా. దేవిగారి మ్యూజిక్‌కు కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్‌తో వర్క్ చేసేటప్పుడు ఆయనతో నా పాట షేర్ చేసుకొని, ఆయన నుంచి సలహాలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఫిలసాఫికల్ సాంగ్స్ రాసినప్పుడు గురువుగారు సీతారామశాస్త్రి గారికి వినిపించి, ఆయన నుంచి సలహాలు తీసుకుంటుంటా. - ‘రంగ్ దే’ కథేమిటి?
- ఒక అబ్బాయి, ఒక అమ్మాయి మధ్య ఎమోషన్స్ ఎలా ఉంటాయనే విషయాన్ని కాంటెంపరరీగా ఈ సినిమాలో వెంకీ చెప్పారు. ఆ ఎమోషన్సే ఈ సినిమాకు ప్రధాన బలం. వాటికి యూత్ బాగా కనెక్టవుతారు.
- ఒక పాట పాపులర్ అయితే దాని క్రెడిట్ మ్యూజిక్ డైరెక్టర్‌దా, లిరిక్ రైటర్‌దా?
- పాట అనేది సమష్టి కృషి ఫలితం. సాహిత్యం, స్వరం, గాత్రం అన్నీ కలిస్తేనే పాట అవుతుంది. ఒక పాట పాపులర్ అయితే, ఏ ఒక్కరికో దాని క్రెడిట్ ఇవ్వకూడదు. ఆ పాట రావడానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆ క్రెడిట్‌లో భాగం ఉంటుంది. పాట పాపులర్ అయితే అందరూ ఎంతో ఆనందిస్తారు.
- సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో పనిచేయడం ఎలా అనిపిస్తుంది?
- నాకు కమర్షియల్‌గా బ్రేక్ ఇచ్చింది త్రివిక్రమ్‌గారి దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించిన ‘జులాయి’ సినిమా. ఆ మూవీ నుంచే ఆ బ్యానర్‌తో నా అనుబంధం మొదలైంది. అప్పట్నుంచే నాగవంశీగారితో పరిచయం, స్నేహం. ఆయన ఆధ్వర్యంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న చిత్రాలకు పాటలు రాయడం హ్యాపీ. నాగవంశీగారు డైనమిక్ ప్రొడ్యూసర్.
- సినిమా రిలీజ్‌కు ముందే పాటలు బాగా పాపులర్ అయి, సినిమాని అవి డామినేట్ చేస్తున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది.. మీరేమంటారు?
- సినిమా విడుదలకు ముందే పాటలు హిట్టయితే, సినిమాని పాటలు డామినేట్ చేస్తున్నట్లుగా దాన్ని చూడకూడదు. లవ్ స్టోరీకి పాటలు పాపులర్ అయితే కమర్షియల్‌గా అది సినిమాకు ఎంతో ఉపయోగపడుతుంది.