డిజిటల్ పేమెంట్స్‌ను పెంచాలనే లక్ష్యంతో ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తో డెబిట్ , క్రెడిట్ కార్డ్స్ వాడే వారు పండగ చేసుకోవచ్చు. కాంటాక్ట్‌లెస్ కార్డుల ట్రాన్సాక్షన్ లిమిట్‌ను పెంచుతున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.
ప్రస్తుతం ఉన్న రూ.2,000 నుంచి రూ.5,000 వరకు పెంచుతున్నట్లు వివరించింది. అంటే రూ.5 వేల వరకు ట్రాన్సాక్షన్లకు ఇకపై పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా సులభంగా మీరు లావాదేవీలను చేసుకోవచ్చు. ఈ కొత్త రూల్స్ జనవరి 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. కరోనా వైరస్ సమయంలో కాంటాక్ట్‌లెస్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ప్రస్తుత కరోనా కాలంలో డిజిటల్ పేమెంట్స్ మరింత సురక్షిత వాతావరణంలో జరగాలన్న ఉద్దేశంతో పరిమితిని పెంచినట్లు ఆర్బీఐ తెలిపింది. టెక్నాలజీ వినియోగం ఎక్కువ కావడంతో కాంటాక్ట్‌లెస్ కార్డ్ ట్రాన్సాక్షన్లు, యూపీఐ పేమెంట్లు పెరిగిపోయాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఇవి డిజిటల్ పేమెంట్లను మరింత సురక్షిత వాతావరణంలో జరిగేలా చూస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.