యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం రాధే శ్యామ్… విడుదల తేదీ డార్లింగ్ అభిమానులను తికమకపెడుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి బరిలో ఈ సినిమా ఉందనగానే… పెద్దతెరపై బొమ్మ ఎప్పుడు పడుతుందా? అని తహతహలాడుతున్నారు. అయితే ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అభిమానుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. అంతేకాకుండా టాలీవుడ్ జక్కన్న రాజమౌళి చెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ విడుదల కూడా వాయిదా పడవచ్చనే టాక్ ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఈ నేపథ్యంలో డార్లింగ్ అభిమానుల్లో గందరగోళం నెలకొంది.
న్యూఇయర్ గిఫ్టుగా రాధే శ్యామ్ సినిమా నుంచి ఓ పోస్టర్ తాజాగా విడుదలైంది. అందులో పైన నీలిరంగు ఆకాశం, కింద నీటి మధ్యలో ప్రభాస్, పూజా హెగ్డేల రొమాంటిక్ స్టిల్ ను ఉంది. కాగా ఆ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే పోస్టర్ లో ప్రభాస్ ను చూసి అభిమానులు కొందరు పండుగ చేసుకుంటుండగా… మరికొందరు మాత్రం అనేక సందేహాలను వెలిబుచ్చుతున్నారు. తాజాగా విడుదలైన ఈ పోస్టర్ లో సినిమా సంక్రాంతి బరిలో అనగా జనవరి 14న విడుదల కానుందని ప్రకటించారు. నూతన సంవత్సరాదిన అధికారికంగా ఈ పోస్టర్ లో పొందుపరిచారు. ఫలితంగా రాధే శ్యామ్ విడుదలలో ఎలాంటి మార్పు లేదని డార్లింగ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.
పోస్టర్ లో తేదీ యథావిధిగా ఉన్నా కూడా సినిమా వాయిదా పడే అవకాశాలు ఉండవచ్చునని ప్రచారం జరుగుతోంది. అంతపెద్ద ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఈ క్రేజీ చిత్రాన్ని కూడా పోస్ట్ పోన్ చేసే అవకాశం లేకపోలేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. పోస్టర్ డిజైన్ కొన్ని రోజుల ముందే చేస్తారు కాబట్టి… అందులో తేదీ అలాగే ఉందని అంటున్నారు. మరికొందరేమే వాయిదా పడే అవకాశం ఉంటే అసలు పోస్టర్ విడుదలను ఆపేసేవారని కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా విడుదల అవుతుందా? వాయిదా పడుతుందా? అని అభిమానులు గందరగోళంలో ఉన్నారు. అయితే రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ అధికారికంగా స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.