పవన్ కళ్యాణ్ అజ్ఞాత వాసి సినిమా తర్వాత సుదీర్ఘ గ్యాప్ తీసుకున్నాడు. దాంతో అభిమానులు పవన్ సినిమా కోసం పిచ్చెక్కి పోతున్నారు. ఇలాంటి స మయంలో వచ్చిన వకీల్ సాబ్ సినిమా వారి లో అంచనాలు ఆకాశానికి పెంచేసింది. బాలీవుడ్ మూవీ పింక్ కు రీమేక్ గా రూపొందిన వకీల్ సాబ్ సినిమా కు కాస్త కమర్షియల్ టచ్ ఇచ్చారు. పింక్ రీమేక్ లో ఫ్ల్యాష్ బ్యాక్ సీన్స్ ను జొప్పించడం వల్ల సినిమా పై అంచనాలు మరింతగా పెంచారు. మరి అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథః
ఎంతో ఇష్టమైన లాయర్ వృత్తిని కొన్ని కారణాల వల్ల సత్యదేవ్(పవన్ కళ్యాణ్) వదిలేస్తాడు. లాయర్ గా ప్రాక్టీస్ మానేసిన పవన్ కళ్యాణ్ వద్దకు ముగ్గురు అమ్మాయిల కేసు ఒకటి వస్తుంది. ఆయన ఆ కేసును టేకప్ చేసేందుకు నిరాకరిస్తాడు. కాని కొన్ని సలహాలు ఇవ్వడంతో కొందరు బెదిరిస్తారు. దాంతో సత్యదేవ్ నేరుగా కోర్టులోకి దిగుతాడు. ఆ అమ్మాయిల తరపున వాదించేందుకు సిద్దం అవుతాడు. ఇంతకు ఆ అమ్మాయిల కేసు ఏంటీ? వారి పట్ల ఉన్న న్యాయం గెలిచిందా? సత్యదేవ్ ఎలా న్యాయంను గెలిపించాడు ఇక సత్యదేవ్ లాయర్ వృత్తిని పక్కకు పెట్టడంకు కారణం ఏంటీ అనేది సినిమా కథాంశం.
విశ్లేషణః
పవన్ కళ్యాణ్ సినిమా అనగానే అంచనాలు భారీగా ఉంటాయి. అంచనాలను అందుకునేందుకు ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కించడం జరిగింది. ఇప్పటికే సక్సెస్ అయిన సినిమా కనుక దీనికి కమర్షియల్ టచ్ ఇచ్చారు. కథ మెయిన్ లైన్ డిస్ట్రబ్ కాకుండా జాగ్రత్తగా ఈ సినిమాను రూపొందించడం జరిగింది. ఫ్ల్యాష్ బ్యాక్ ఎపిసోడ్ విషయంల ఇంకాస్త బెటర్ గా చూపించి ఉంటే బాగుండేది. ఇక పవన్ కళ్యాణ్ నటన విషయానికి వస్తే సూపర్ అని చెప్పుకోవచ్చు. మూడేళ్ల తర్వాత కెమెరా ముందుకు వచ్చినా కూడా పవన్ లో ఆ స్టైల్ ఏమాత్రం తగ్గలేదు.
ఇక దర్శకుడు వేణు శ్రీరామ్ పింక్ కు కమర్షియల్ యాంగిల్ ను తీసే ప్రయత్నంలో సఫలం అయ్యాడనే చెప్పాలి. సినిమాలోని కోర్టు సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. పవన్ కళ్యాణ్ ఒకటి రెండు సీన్స్ లో కనబర్చిన నటన అద్బుతం. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవల్ కు తీసుకు వెళ్లింది. ఆయన ఈ సినిమా విజయంలో కీలకంగా నిలిచారు అనడంలో సందేహం లేదు. ప్రకాష్ రాజ్ మరియు పవన్ కళ్యాణ్ ల కాంబో సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి. శృతి హాసన్ ఎపిసోడ్ ను ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా తీసి ఉండాల్సింది. ఆ ఎపిసోడ్ ను కట్ చేసినా పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. మొత్తానికి వకీల్ సాబ్ సినిమా అభిమానులను రంజింపజేయడంతో పాటు అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు. ఆడవారికి మద్దతుగా ఉన్న ఈ సినిమా ను కమర్షియల్ యాంగిల్ లో కాకుండా చూస్తే తప్పకుండా ఇదో మంచి సినిమా అనడంలో సందేహం లేదు.
ప్లస్ పాయింట్స్‌ః
పవన్ కళ్యాణ్,
కోర్టు సన్నివేశాలు,
థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్,
అంజలి, నివేథా థామస్,
ప్రకాష్ రాజ్,
క్లైమాక్స్.
మైనస్ పాయింట్‌ః
శృతి హాసన్ ఎపిసోడ్,
ఫస్ట్ హాఫ్‌లో కొన్ని బోరింగ్ సన్నివేశాలు.
చివరగా..
అభిమానుల అంచనాలు నిలిపేలా ఉన్న ‘వకీల్ సాబ్’
రేటింగ్ : 3.25/5.0