దర్శకుడిగా ఓంకార్ వరుసగా ఫ్లాప్స్ పడుతున్నా కూడా సినిమాలను మాత్రం వదలడం లేదు. ఒక వైపు బుల్లి తెరపై ఎప్పుడు ఏదో ఒక షోను నిర్వహిస్తూ ఉండే ఓంకార్ ఇప్పుడు రాజు గారి గది 4 సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడట. ఇప్పటి వరకు చేసిన మూడు రాజు గారి గది సినిమాల్లో మొదటిది మాత్రమే సక్సెస్ అయ్యింది. మిగిలిన రెండు పార్ట్ లు కూడా నిరాశకు గురి చేశాయి.
హర్రర్ తక్కువ కామెడీ తక్కువ అన్నట్లుగా రెండు మూడు సిరీస్లు సాగాయి. ఇప్పుడు ఓంకార్ కాస్త విభిన్నంగా నాల్గవ పార్ట్ ను తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేసే ఉద్దేశ్యంతో ఓంకార్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
దర్శకుడు ఓంకార్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా సహ నిర్మాతగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు వ్యవహరిస్తున్నారు. సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్ డేట్ ను త్వరలో ప్రకటించబోతున్నారు. ఈ ఏడాది చివరి వరకు థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కట్టేది అనుమానంగా ఉంది. కనుక అప్పటి వరకు సినిమాను ఆపకుండా ముందుగానే హాట్ స్టార్ లో విడుదల చేయాలని భావిస్తున్నారట. ఈ విషయంలో ఇప్పటికే నిర్ణయం జరిగిపోయింది.
భారీ ఎత్తున బడ్జెట్ పెట్టకుండా సింపుల్ గా మూడు నుండి మూడున్నర కోట్లలో సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాలో కూడా ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. హీరోయిన్ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొదటి పార్ట్ మాదిరిగా ఈ సినిమా కూడా విభిన్నంగా ఉంటుందా లేదంటే రెగ్యులర్ గా రెండు మూడు పార్ట్ ల మాదిరిగా ఉంటుందా అనేది చూడాలి.