మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగనా చేసిన పోరాటం ప్రతిఫలంగా ముంబయిలోని ఆమె ఆఫీస్ ను కూల్చివేతకు సిద్దం అయ్యారు. ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ అనూహ్యంగా కంగన ఆఫీస్ ను కూల్చి వేయడం మొదలు పెట్టడంతో బాలీవుడ్ ప్రముఖులు అంతా కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇది ఏమాత్రం సరైన నిర్ణయం కాదన్నారు.
కంగనా ఆఫీస్ ను కూల్చివేయడం అనేది ఒక ప్రతీకార చర్య అంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ తీరుకు వ్యతిరేకంగా మహారాష్ట్ర హై కోర్టును కంగనా ఆశ్రయించింది. వెంటనే హైకోర్టు నుండి ఆమెకు సానుకూలమైన తీర్పు వచ్చింది. కూల్చి వేత ఆపేయాలంటూ స్టే విధించింది. తదుపరి విచారణ జరిగే వరకు కంగనా ఆఫీస్ ను కూల్చి వేయకూడదు అంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో కూల్చి వేత ఆగిపోయింది.
కంగనా గత మూడు నెలలుగా సుశాంత్ మృతి విషయంలో ముంబయి పోలీసులను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తోంది. బాలీవుడ్‌లో ఉన్న కొందరు మాఫియాలా ప్రవర్తిస్తున్నారు. వారి కారణంగానే సుశాంత్ చనిపోయాడు అంటూ అసహనం వ్యక్తం చేసింది. ముంబయిలో శివసేన కార్యకర్తలు తనను అడుగు పెట్టనివ్వం అంటూ హెచ్చరించడంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో ముంబయిని కంగనా పోల్చింది. అప్పటి నుండి వివాదం మరింతగా ముదిరింది.
నేడు తన సొంత ప్రాంతం అయిన మనాలి నుండి ముంబయికి కంగనా చేరుకుంది. అంతుకు ముందే ఆమె ఆఫీస్ ను నేల మట్టం చేయాలని శివసేన పార్టీ మరియు ప్రభుత్వం అనుకుందట. అందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయితే అప్పటికే కోర్టు స్టే విధించడంతో వెనక్కు తగ్గక తప్పలేదు.