భారీ చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న గుణశేఖర్ అయిదు సంవత్సరాల క్రితం ‘రుద్రమదేవి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా దాదాపుగా రూ.85 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి లేడీ ఓరియంటెడ్ మూవీల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా అప్పట్లో రికార్డు సాధించింది. ఆ సినిమా తర్వాత గుణశేఖర్ మళ్లీ ఇప్పటి వరకు కొత్త సినిమాను మొదలు పెట్టలేదు.
రుద్రమదేవి విడుదల సమయంలోనే ‘ప్రతాపరుద్రుడు’ సినిమాను చేయాలని భావించారు. కాని ఆ సినిమా వర్కౌట్ కాలేదు. అసలు ఆ సినిమా పట్టాలు కూడా ఎక్కేలేదు. ఆ తర్వాత రానాతో హిరణ్యకశ్యప సినిమాను చేయబోతున్నట్లుగా గుణశేఖర్ ప్రకటించాడు. అది కూడా రెండు సంవత్సరాలుగా వెనుక బడి పోతుంది. అది ఎప్పటికి ప్రారంభం అయ్యేది తెలియడం లేదు. ఈ సమయంలో ఆయన శాకుంతలం మూవీని చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.
వెండితెరపై ‘హిరణ్యకశ్యప’లో నరసింహావతారాన్ని సాక్షాత్కరింపజేసే ముందు … భారతాన ఆదిపర్వంలోని ఆహ్లాదకర ప్రేమకథని ఆవిష్కరిస్తూ… అంటూ గుణశేఖర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన శాకుంతలం మూవీ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన నటీనటులు ఇతర వివరాలను వెళ్లడించబోతున్నట్లుగా పేర్కొన్నారు.
ఈ సినిమాను అయినా గుణశేఖర్ ముందుకు తీసుకు వెళ్తాడా లేదంటే మళ్లీ దీన్ని కూడా వదిలేస్తాడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాని గుణశేఖర్ ఈసారి ఈ సినిమాను వదిలేసే అవకాశం కనిపించడం లేదు. ఆయన దీనిని కూడా వదిలేస్తే ఆయన్ను అంతా వదిలేస్తారు అని ఆయనకు తెలుసు.