మొన్నటి వరకు ఏపీలో సినిమా టిక్కెట్ల వ్యవహారంపై జరిగిన గొడవలు అందరికీ తెలిసినవే. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నారు. ఇప్పుడిప్పుడే వారందరి మధ్య సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. అయితే ఏపీ ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి ఉన్న గ్యాప్ తగ్గింది. అయితే సినిమా టికెట్ల విషయంలో చర్చలు జరుగుతున్న సమయంలో సీఎం జగన్ కమెడియన్ ఆలీపై చేయి వేసి నవ్వడం చర్చనీయాంశంగా మారింది.
అయితే సీఎం జగన్ ఆలీ భుజం తట్టి వచ్చేవారం కలుద్దామని చెప్పారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతే కాదు నటుడు ఆలీకి రాజ్య సభ సీటు ఇస్తున్నారంటూ చెప్పేస్తున్నారు. ఆలీ వైసీపీ మద్దతుదారు కావడంతో ఇది నిజమేనంటూ మరికొంత మంది వార్తలను షేర్ చేస్తున్నారు. అయితే ఆలీ గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ను కాదని వైసీపీ తరఫున ప్రచారం చేశారు. ఆలీ వల్ల తమ పార్టీకీ ప్రయోజనం చేకూరిందని.. అందుకే సీఎం జగన్ రాజ్యసభ సీటు ఇవ్వబోతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
మరోవైపు రాజ్య సభ్యుల విషయానికి వస్తే వైసీపీలో ముస్లింల నుంచి ఓ ఒక్కరూ లేరు పైగా పదవుల పంపకాల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించారు కూడా. ఈ ఈక్వేషన్లకు అనుగుణంగా ఇప్పటి వరకు సీట్ల పంపకం జరిగింది. అందుకే ఆలీని ఎంపీ చేస్తారంటూ విపరీతంగా చర్చ జరుగుతోంది.
అయితే రాజ్యసభకు అవకాశం ఎవరికి ఇవ్వాలన్న చర్చ వచ్చినప్పుడు ఆలీ పేరు పార్టీ పరిశీలనలోకి వచ్చినట్లు వైసీపీ నేతలు తెలిపారు. అయితే మరి సీఎం జగన్ మనసులో ఏముందో మాత్రం ఎవరికీ తెలియదు. గ్లామర్ ఇండస్ట్రీ నుంచి ఆలీకి ఎంపీ సీటు ఇస్తున్నారా లేదా తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.