తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’.. బ్లాక్‌బస్టర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఒరిజినల్ కంటెంట్, షోస్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, హృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ‘ఆహా’లో ప్రసారమై ప్రేక్షకులను మెప్పించిన టాక్ షో ‘సామ్ జామ్’. సమంత అక్కినేని వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షో ఎంటర్‌టైన్‌మెంట్ సాధికారితకు ఓ ఉదాహరణగా నిలిచింది. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ అదించడమే పరమావధిగా కాకుండా సామాజిక మార్పులో ఈ షో భాగమైంది. ఈ షోలో టాలీవుడ్‌కి చెందిన అగ్ర తారలందరూ పాల్గొనడమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో పలువురి జీవితాల్లో మంచి మార్పులకు కారకులుగా ఉండి గౌరవాన్ని తీసుకొచ్చారు. ‘ఆహా’ ప్రసారమైన సామ్‌జామ్ ద్వారా నారాయణ్ ఖేడ్‌కు చెందిన కవిత రాథోడ్ జీవితంలో మార్పు సంభవించింది.
చిన్నతనంలోనే తల్లిని పొగొట్టుకున్న కవిత రాథోడ్, కుటుంబ బరువు బాధ్యతలను నిర్వహించాల్సి వచ్చింది. జీవనోపాధి కోసం హైదరాబాద్ చేరుకున్న ఆమె, అంకుల్ సాయంతో ఆటో నడపటం నేర్చుకుంది. జీవన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఈ జర్నీలో తన కుటుంబం కోసం మగాడిలా మారింది. తన తోబుట్టువులకు మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేయడమే తన కర్తవ్యంగా పెట్టుకుంది. కానీ కొవిడ్ 19 కారణంగా ఆమె లక్ష్యానికి ఆటంకం ఏర్పడింది. అయితే ప్రత్యామ్నాయంగా తన పెద్ద కుటుంబానికి రక్షణగా ఒక హోటల్ ప్రారంభించడానికి తన సొంత గ్రామానికి తిరిగి వచ్చింది.
జీవితంలో కవిత ఎదుర్కొన్న ఒడిదొడుకులను గుర్తించిన తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ ..సామ్ జామ్ షోకు అతిథిగా ఆహ్వానించింది. ఈ షోలో సమంత, తమన్నా సమక్షంలో కవితను సన్మానించారు. జీవితంతో కవిత చేస్తున్న పోరాటం చూసి స్ఫూర్తి పొందిన సమంత కారును గిఫ్ట్‌గా అందిస్తామని ప్రకటించారు. ప్రకటించినట్లుగానే కవితను కారును అందించారు. కారు కవిత జీవితంలో మంచి మార్పును తీసుకొచ్చింది. కవిత ఇప్పుడు ఓ కారుకు యజమాని మాత్రమే కాదు, కొన్ని నెలల్లోనే కారును ఈ బిజీ రోడ్లపై ఎలా నడపాలో నేర్చుకుంది. ఏకకాలంలో కారు, ఆటో డ్రైవింగ్‌ను బ్యాలెన్స్ చేయగలనని కవిత భావిస్తోంది. అలాగే తనకు అన్ని రకాలుగా సాయపడ్డ ఆహాకి, సమంతకు.. సామ్ జామ్ షో నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది కవిత.