ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా తన దూకుడు పెంచింది. సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు సమంత తో ఒక టాక్ షో చేస్తుంది. ‘సామ్ జామ్’ పేరుతో ఈ టాక్ షో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇప్పటికే అనేకమంది స్టార్స్ ఈ షో కు వచ్చి పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకోగా..తాజాగా మెగాస్టార్ చిరంజీవి వచ్చి షో ను మరింతలేపారు.
తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చారు. ఈ ఎపిసోడ్ న్యూ ఇయర్ కానుకగా ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబందించిన ప్రోమో విడుదల చేయగా..అది మెగా అభిమానుల్లో ఆగ్రహం తెప్పించింది.
ఈ ప్రోమోలో అల్లు అర్జున్‌కి ముందు ‘మెగాస్టార్’ అనే బిరుదును చేర్చడం వివాదాస్పదమైంది. టాలీవుడ్లో మెగాస్టార్ అంటే చిరంజీవి ఒక్కరేనని, అల్లు అర్జున్ పేరు ముందర ఆ బిరుదును ఎందుకు చేర్చారంటూ మెగా అభిమానులు ‘ఆహా’ నిర్వాహకులపై మండిపడ్డారు. ఈ వివాదాన్ని వెంటనే గుర్తించిన ‘ఆహా’ టీమ్ తన తప్పును సరిదిద్దుకుంది. మెగాస్టార్ అభిమానులకు ట్విటర్ ద్వారా క్షమాపణలు చెప్పింది. సాంకేతిక తప్పిదం వల్లే అలా జరిగింది తప్ప ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. ‘ఒకే ఒక్క మెగాస్టార్.. మనందరికీ ఇది తెలుసు’ అంటూ వివాదం ఫై నీళ్లు చల్లే ప్రయత్నం చేసింది. మరి ఈ క్షమాపణలతో మెగా ఫ్యాన్స్ శాంతిస్తారో లేదో చూడాలి.