బుల్లి తెర సూపర్ స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్న ప్రదీప్ మాచిరాజు ఇంతకు ముందు చాలా సినిమాల్లో కనిపించాడు. కాని హీరోగా నటించడం ఇదే మొదటి సారి. గత ఏడాది సినిమా విడుదల తేదీ ప్రకటించిన తర్వాత అనూహ్యంగా కరోనా రావడం వల్ల సినిమాను వాయిదా వేశారు. ఓటీటీ ఆఫర్ వచ్చినా కూడా వద్దనుకున్నారు. చివరకు సినిమా నేడు విడుదల అయ్యింది. పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేయడంతో పాటు నీలినీలి ఆకాశం పాట సెన్షేషన్ సక్సెస్ అయ్యింది. కనుక ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
1947లో అరకు ప్రాంతంకు చెందిన జంట ప్రేమించుకుంటారు. వారు ఒకరికి ఒకరు ప్రాణంగా ప్రేమించుకున్నా చిన్న చిన్న కారణాల వల్ల అపార్థం చేసుకుని చివరకు చనిపోతారు. అలా చనిపోయిన వారే మళ్లీ అర్జున్(ప్రదీప్), అక్షర(అమృత అయ్యర్) గా జన్మిస్తారు. చిన్నప్పటి నుండి ఒకరిపై ఒకరికి కోపం. పక్క పక్క ఇల్లు అవ్వడంతో పాటు ఒకే స్కూల్ మరియు కాలేజ్ అవ్వడంతో ప్రతి సారి గొడవ పడుతూనే ఉంటారు. అలా వారు అనేక సార్లు గొడవ పడ్డా ఒకసారి స్నేహితులతో కలిసి అరకు వెళ్తారు. అక్కడ ఒక విగ్రహం వద్ద వారికి అనూహ్య సంఘట జరుగుతుంది. ఆ సంఘటన ఏంటీ? వారికి పూర్వ జన్మ గుర్తుకు వచ్చిందా? అనేది సినిమా కథాంశం.
విశ్లేషణ:
నీలి నీలి ఆకాశం అంటూ గత ఏడాది కాలంలో ఎక్కడ చూసినా కూడా పాట మారు మ్రోగి పోయింది. పాటంత బాగుంటుంది సినిమా అంటూ ప్రచారం చేశారు. సినిమా కోసం ప్రదీప్ అభిమానులు ముఖ్యంగా అమ్మాయిలు సినిమా చాలా ఎక్కువగా అంచనాలు పెట్టుకుని ఎదురు చూశారు. ప్రదీప్ కోసం వెయిట్ చేసిన వారికి కాస్త పర్వాలేదు అనిపించవచ్చు. కాని ఓవరాల్ గా సినిమాను చూస్తే మాత్రం నిరాశ తప్పదు అన్నట్లుగా ఉంది. సినిమా లో కథను సీన్స్ ను చూస్తే దర్శకుడు మున్నాపై హిట్ సినిమాల ప్రభావం చాలా ఉన్నట్లుగా అనిపించింది. మహేష్ బాబు సీన్స్ తో పాటు చాలా మంది హీరోల సీన్స్ ను డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో జొప్పించాడు. అది కామెడీ కోసం అనుకున్నాడేమో కాని కాపీలా అనిపించింది. ఇక కథ కూడా గతంలో వచ్చిన పునర్జన్మల సినిమా కథలా ఉంది. సినిమా మొత్తంను ప్రదీప్ తన భుజస్కందాలపై మోసినట్లుగా అనిపించింది. కొన్ని కామెడీ సీన్స్ అక్కడక్కడ పేలిన పంచ్ డైలాగ్స్ మినహా సినిమాలో గొప్ప ఎలిమెంట్స్ ఏమీ లేవు. సినిమా కథ సాగతీసినట్లుగా ఉంది. చాలా సీన్స్ ను ఎడిటింగ్ లో సగానికి సగం లేపేసే అవకాశం ఉంది. కాని దర్శకుడు మాత్రం స్క్రీన్ ప్లే పేరుతో వాటినే సాగదీస్తూ వచ్చాడు. చివరకు సినిమా ఒక మోస్తరుగా సాగింది. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ తో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి. కొన్ని సీన్స్ మరీ ఓపికకు పరీక్ష పెట్టేవిగా ఉన్నాయి. ప్రదీప్ కథ విషయంలో ఇంకాస్త బెటర్మెంట్ చూసుకుని ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్ :
ప్రదీప్, అమృత అయ్యర్,
రెండు పాటలు,
కథలో ట్విస్ట్.
మైనస్ పాయింట్స్ :
కథ, కథనం,
సెకండ్ హాఫ్,
ఎడిటింగ్,
దర్శకత్వం
చివరగా…
30 కథలను కాపీ చేయడం ఎలా అంటే ఇలా అని చెప్పొచ్చు.
రేటింగ్: 2.0/5.0