ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ నిర్ణయం తమను ఎంతో సంతోష పరిచిందని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి తెలిపారు. ఏపీలో టికెట్ రేట్లకు సంబంధించి ఎండ్ కార్డు పడినట్లేనని భావిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో చిన్న సినిమాల ఐదో షోకు అనుమతించడం శుభ పరిణామమని చిరంజీవి అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌తో సినీ సెలబ్రిటీల సమావేశం తర్వాత చిరు మీడియాతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి సంబంధించి ఫిబ్రవరి నెల ఆఖరులోనే జీ.వో. వస్తుందని భావిస్తున్నామని మెగాస్టార్ చెప్పారు.
మంత్రి పేర్ని నాని చొరవతో ఈ సమస్యలకు పరిష్కారం దొరికిందని కొనియాడారు. హైదరాబాద్ తరహాలో విశాఖపట్నంలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు జగన్ చెప్పారని మెగాస్టార్ తెలిపారు. దానికి తమ వంతు సహకారం ఉంటుందని తెలియజెప్పినట్లు చిరు మీడియాలో వెల్లడించారు. సుహృద్భావ వాతావరణంలో భేటీ జరిగిందని.. సామరస్య పూర్వకంగా సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు.
గత కొన్ని రోజులుగా ఏపీలో సినిమా టికెట్ల రేట్లపై వివాదం కొనసాగుతోంది. ఏ, బీ, సీ సెంటర్లగా థియేటర్లను విభజించి.. తక్కువ రేట్లను నిర్ణయించారని పరిశ్రమ గగ్గోలు పెడుతోంది. ఏపీ ప్రభుత్వం నిర్ణయం వల్ల సినీ పరిశ్రమ దెబ్బతింటుందని ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారు.
చాలా తక్కువ రేట్లను నిర్ణయించడం వల్ల పరిశ్రమ నుంచి మంచి సినిమాలు రావని ఆరోపించారు. బాహుబలి లాంటి పెద్ద సినిమాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మరిన్ని రావాలంటే… రేట్లు అందుకు తగినట్లుగా ఉండాలని కోరారు.