టాలీవుడ్ జక్కన్న ఏదైనా ప్రాజెక్టు మొదలుపెడితే… ఇక దాన్ని చెక్కి చెక్కి ఓ అందమైన రూపాన్ని అందిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మూడేళ్లుగా ఈయన ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు కోసం పని చేస్తున్నారు. సాట్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ ను ఒకే తెరపై చూపించే ఓ పెద్ద ప్రయత్నాన్ని భుజానికి ఎత్తుకున్నారు. నాటి నుంచి ఇప్పటివరకు ఆ దిశగానే కృషి చేస్తున్నారు. మరి ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం విడుదల కోసం అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి బరిలో ఉందనగానే రోజులు లెక్కబెడుతూ కాలం గడుపుతున్నారు. అయితే ఆ అభిమానులు ఇవాళ చేదు వార్త వినాల్సి వచ్చింది. మరికొన్ని రోజుల్లో వెండితెరపై ఈ కళాఖండాన్ని చూడాలనుకున్న ప్రేక్షకులకు ఓ బ్యాడ్ న్యూస్ అందింది. సినిమా విడుదలను వాయిదా వేస్తూ చిత్రబృందం నిర్ణయం తీసుకుంది.
కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను జనవరి 7, 2022 విడుదల చేయడం లేదని చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్రంపై చూపుతున్న ప్రేమ, ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పటివరకు తదుపరి రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదు. అయితే ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం.. మళ్లీ పోస్ట్ పోన్ అవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఎన్నిసార్లు వాయిదా వేస్తారంటూ చిత్రయూనిట్ ను ప్రశ్నిస్తున్నారు. మాటిమాటికి వాయిదా వేస్తే సినిమాపై ఉన్న ఆసక్తి పోతోందని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైన చిత్రబృందం నిర్ణయమే కాబట్టి ఇక అభిమానులకు నిరాశ తప్పలేదు.
అసలే యంగ్ అండ్ క్రేజీ స్టార్లు… ఆపై జక్కన్న… మరోవైపు ముద్దుగుమ్మ ఆలియా వీటికి తోడు కీరవాణి మ్యూజిక్. ప్రేక్షకులను మ్యాజిక్ తో కట్టిపడేయడానికి ఇవి చాలు కదా. ఇంతటి ప్రతిష్ఠాత్మక చిత్రం కోసం నెలలపాటు ఎదురుచూడడం సహజమే. కానీ ఈ చిత్రం కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి 2018లో మొదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చింది. తొలుత 2020, జులై 30న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత జనవరి 8, 2021 అని ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ వాయిదా పడింది. అనంతరం కరోనా, ఇతర కారణాల వల్ల అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. చివరగా జనవరి 7, 2022 ఫిక్స్ అని అన్నారు. ఆ దిశగా ప్రచార కార్యక్రమాలు కూడా హోరెత్తించారు. కానీ అనూహ్యంగా ఈసారి కూడా సినిమా వాయిదా పడింది.