ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ కాంబినేషన్‌లో రూపొందిన ప్రేమకథా చిత్రం `99 సాంగ్స్`. ఇహాన్ భట్, ఎడిల్‌సీ జంటగా నటించారు. విశ్వేష్ కృష్ణమూర్తి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 16, 2021న విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా సోమవారం చిత్ర యూనిట్ వెబినార్‌లో ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్, హీరో ఇహాన్ భట్ పాత్రికేయులతో ముచ్చటించారు.
* మ్యూజిక్ కంపోజర్‌గా 29 ఏళ్లు వర్క్ చేశాను. ఇరవై ఏళ్ల తర్వాత మ్యూజిక్, ఆర్ట్ వర్క్స్‌కు సంబంధించిన మరింత లోతుగా ప్రయాణాన్ని ప్రారంభించాలని అనుకున్నాను. ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గొప్ప దర్శకులున్నారు. అమేజింగ్ మూవీస్ చేస్తున్నారు. ఆ క్రమంలో వచ్చిన ఆలోచనే `99 సాంగ్స్`. సినిమా మ్యూజిక్‌కు సంబంధించిన సినిమానే అయినా అందులో చాలా లేయర్స్ ఉన్నాయి. గత దశాబ్దంలోని ఆడియెన్స్‌కు, ఇప్పటి ఆడియెన్స్‌కు చాలా తేడా ఉంది. ఇప్పటి ప్రేక్షకులు వరల్డ్ సినిమాలను చూస్తున్నారు. మన ప్రేక్షకులు ఇతర భాషల సినిమాలను ఎలా చూస్తున్నారో మన సంస్కృతిని తెలియజేసే సినిమాలను ఇతర దేశాల ప్రేక్షకులు చూసే అవకాశం ఉంది.
* `99 సాంగ్స్`కు మెయిన్ సోల్ మ్యూజిక్.. అలాగే స్టోరి నెరేషన్. మన భారతీయులు కర్మ వంటి పలు విషయాలను బలంగా నమ్ముతారు. అవి మన జీవితాలను ముందుకు తీసుకెళుతాయి. నేను `99 సాంగ్స్` సినిమాను పాత ప్రపంచం, కొత్త ప్రపంచానికి మధ్య ఉన్న వేరియేషన్‌ను చూపించేలా తెరకెక్కించాం. ఇందులో ప్రేమ ఉంది. ఆర్టిస్టిక్ పంథాలో క్వాలిటీగా, ఎగ్జయిట్‌మెంట్‌గా ఉండేలా తెరకెక్కించాను.
* నేను నా జర్నీలో ఎంతో మంది అమేజింగ్ డైరెక్టర్స్‌తో పనిచేశాను. వారితో కలిసి ఇంకా పనిచేయాలని కూడా అనుకుంటున్నాను. అయితే మరి ఆ దర్శకులను తీసుకోకుండా విశ్వేష్ కృష్ణమూర్తిని ఎందుకు తీసుకున్నానని చాలా మంది అనుకోవచ్చు. అయితే నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయమేమంటే.. నేను ఈ సినిమాకు రైటర్‌గా కూడా వర్క్ చేశాను. ఓ ఎక్స్‌పీరియెన్స్‌డ్ డైరెక్టర్ దగ్గరకు వెళ్లి రైటర్‌గా మాట్లాడితే.. మ్యూజిక్ డైరెక్టర్‌గానే చూస్తారు. అది కాస్త ఇద్దరికీ ఇబ్బందిగా అనిపించొచ్చు. అందువల్ల నేటి జనరేషన్‌కు తగినట్టు ఓ కొత్త డైరెక్టర్‌తో చేయాలని అనుకున్నాను. అలా విశ్వేష్ కృష్ణమూర్తి ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. ఆయన సంగీత దర్శకుడు కూడా. దాని వల్ల సన్నివేశానికి ఏ మ్యూజిక్ సపోర్ట్ చేస్తుందనేది అవగాహన ఉంటుంది. కాబట్టి విశ్వేష్‌ను ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేస్తే బావుంటుందనిపించింది. ఇద్దరం కొత్త వాళ్లం కాబట్టి ఓ అవగాహనతో ముందుకెళ్లొచ్చు అనిపించింది.
* సంగీతం అనేది తరాలను, సంస్కృతులను కలిపే ఓ సాగరం. ఈ సినిమాలో కూడా హీరో పాత్ర పాత తరానికి, కొత్త తరానికి మధ్య సంఘర్షణ పడుతుంటాడు. ఈ పాయింట్ ప్రేక్షకులను నచ్చుతుందని భావిస్తున్నాను.
* ఇంతకు ముందు చెప్పినట్లు ప్రేక్షకులు ప్రపంచ సినిమాను వీక్షిస్తున్నారు. ఈ క్రమంలో వారు మన సినిమాను మరో రేంజ్‌లో చూడాలని అనుకుంటున్నారు. అలాంటి వారి కోణంలో ఈ సినిమాను ఓ రైటర్‌గా, నిర్మాతగా రూపొందించాను. నా ప్రయత్నానికి విశ్వేష్ వంటి వాళ్లు సపోర్ట్‌ను అందించారు. జియో సంస్థ మా సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వచ్చింది. ప్రతి భాషలో సినిమాను ప్రేక్షకుడు ఒరిజినల్ మూవీ అని ఫీల్ కావాలని అన్ని భాషల్లో రూపొందించాం. కొత్త నటీనటులతో మూడు భాషల్లో సినిమా చేయడమే కాదు.. దాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకు వస్తున్నాం. ఇదే మా గొప్ప సక్సెస్ అని భావిస్తున్నాను.
* ఇది నా కథ కాదు. ఈ సినిమాకు నా లైఫ్ పూర్తి విరుద్ధంగా ఉంటుంది. నాన్నగారు మ్యూజిక్ చేశారు.. నువ్వు కూడా మ్యూజిక్ చెయ్ అని అమ్మ చెప్పడంతో నేను మారు మాట్లాడకుండా మ్యూజిక్ చేశాను. ఈ సినిమా విషయానికి వస్తే.. ఇది ఎలాంటి మ్యూజిక్ బ్యాగ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి ఓ యువకుడు మ్యూజిక్ రంగంలోకి అడుగు పెడితే ఎలా ఉంటుందనే పాయింట్‌ను టచ్ చేస్తున్నాం.
* నేను నిర్మాతగా మారాలని ఎప్పుడూ అనుకోలేదు. ఈ సినిమా విషయానికి వచ్చేటప్పటికి.. కొన్ని కొత్త విషయాలను చేయాలనుకున్నప్పుడు ధైర్యం చేసి ముందడుగు వేయాలనిపించింది. సముద్రంలోకి దూకినప్పుడు ఈత కొట్టకపోతే చనిపోతాం. బతకాలంటే ఈదాల్సిందే. నేను కూడా ఈ సినిమా ప్రాసెస్‌లో అలాంటి ఓ ప్రయత్నాన్ని చేశాను. ఇక్కడకు రావడానికి బాగానే ఈత కొట్టాననిపించింది. ఈ ప్రయాణం ఎగ్జయిటింగ్‌గా అనిపించింది.
* ఆస్కార్ అవార్డ్ వచ్చినప్పుడు అందరూ నన్ను పొగడ్తలతో ముంచెత్తారు. నాలుగైదేళ్లు నేను హాలీవుడ్‌కే పరిమితం అయ్యాను. నేను అకాడమీ సభ్యుడిగా మారాను. హాలీవుడ్‌కి చెందిన టాప్ టెక్నీషియన్స్‌ను కలుసుకున్నాను. నేను చాలా వర్క్ షాప్స్‌లో పాల్గొన్నాను. కొత్త విషయాలను నేర్చుకున్నాను. ఈ ప్రయాణంలో నేను గమనించిన విషయాలన్నీ ఈ సినిమాకు ప్రధానాంశాలుగా మారాయి.
* నేను తెలుగు సినిమాలను ఇష్టపడతాను. బెస్ట్ మూవీ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను.
* ఇహాన్ భట్, ఎడిల్‌సీలను ఈ సినిమాకు ఎంపిక చేసుకునేటప్పుడు ఫ్యూచర్‌ను దృష్టిలో పెట్టుకున్నాను. కేవలం యాక్టింగ్ కోణంలోనే కాకుండా, ఇండస్ట్రీకి మనం ఏం ఇస్తున్నామనే కోణంలో ఆలోచించాను. అందుకనే అన్నీ భాషల్లో తను కనెక్ట్ అయ్యేలా ట్రైనింగ్ కూడా ఇప్పించాను.
* ఎడిల్‌సీ అద్భుతమైన నటి. తను కోవిడ్ కారణంగా ప్రమోషన్స్‌లో పాల్గొనడం లేదు. న్యూయార్క్‌లో ఉంది.
* నేను సంగీతం లేకుండా ఉండలేను. నేను డైరెక్షన్‌లోకి అడుగు పెడితే, రెండు, మూడేళ్లు మరో విషయం గురించి ఆలోచించకూడదు.
ఇహాన్ భట్ మాట్లాడుతూ “రెహమాన్‌గారు నాకు ఇన్‌స్పిరేషన్ ఆయనతో కలిసి `99 సాంగ్స్` సినిమా చేయడం ఓ మెమొరబుల్ ఎక్స్‌పీరియెన్స్. ఆయన రుణం ఎలా తీర్చుకుంటానో తెలియడం లేదు. ఓ కొత్త వాడైన నాకు యాక్టింగ్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆయన పర్యవేక్షణలో నటనలో శిక్షణ ఇప్పించడంతో పాటు పియానో కూడా ఏడాది పాటు శిక్షణ ఇప్పించారు. ఓ గురువులా, బ్రదర్‌లా, స్నేహతుడిలా గైడెన్స్‌ను అందించారు. ఇప్పుడు నన్ను ఎవరూ చూసిన ఓ నువ్వు రెహమాన్‌గారి హీరో కదా అని అంటున్నారు. అలా రెహమాన్‌గారు నాకొక ఐడెంటిటీగా మారారు“ అన్నారు.