సందీప్ కిషన్, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తోన్న చిత్రం ‘గల్లీ రౌడీ’. ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. డైరెక్టర్ వి.వి.వినాయక్, డైరెక్టర్ నందినీ రెడ్డి ‘గల్లీ రౌడీ’ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు కోన వెంకట్ మాట్లాడుతూ – “‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని కోవిడ్ సమయంలోనే స్టార్ట్ చేశాం. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో సార్ ఓ కథ ఉంది వినండి అని సందీప్ .. భాను, నందు అనే రైటర్స్‌ను రాసిన కథను నాగేశ్వరరెడ్డిగారి దగ్గరకు పంపితే, ఆయన నా దగ్గరకు పంపాడు. ఓ కథ మనుషులను కలుపుతుంది. వేల మందిని కదుపుతుంది. కొత్త స్నేహాలు, పరిచయాలు, బంధాలు కథ వల్ల ఏర్పడుతుంది. ఆ కథ విన్న వెంటనే సూపర్ హిట్ స్టోరి అని అర్థమవుతుంది. నవంబర్ 22న కథను వింటే, డిసెంబర్ 16నుంచి షూటింగ్‌ను వైజాగ్‌లో స్టార్ట్ చేశాం. మొత్తం షూటింగ్ పూర్తయిన తర్వాతే హైదరాబాద్‌కు వచ్చాం.
సందీప్ జడ్జ్‌మెంట్ చాలా బావుంటుంది. తను ఈ కథకు హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ అయ్యాడు. కథకు ఉండే శక్తి వల్లనే రాజేంద్ర ప్రసాద్‌గారితో కలిసి పనిచేసే అదృష్టం కలిగింది. ఈ సినిమాకు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. ఒకరు రామ్ మిర్యాల.. తర్వాత సాయికార్తీక్ కూడా యాడ్ అయ్యాడు. ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్ టీమ్‌లో జాయిన్ అయ్యాడు. దేనికైనా రెఢీ తర్వాత నేను, నాగేశ్వర్ రెడ్డిగారు కలిసి పనిచేసిన చిత్రమిది. సందీప్‌కు జోడీగా నేహా శెట్టి కుదిరింది.
నేహా అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉన్న నటి. బాబీ సింహ, వెన్నెల కిషోర్, పోసాని ఇలా మాయ జరిగినట్లు అందరినీ సినిమా కలిపేసింది. ఇదొక ఢీ లాంటి సినిమా అని చెప్పగలను. ఒక వైపు టెన్షన్ ఉంటూ మరో వైపు ఫన్.. రెండు పట్టాల్లాగా వెళ్లే సినిమా మా గల్లీ రౌడీ. ఏ కామెడీని నేను నమ్ముకుని నాకు పేరొచ్చిందో అలాంటి కామెడీతో పాటు మంచి ఎమోషన్ ఉండే సినిమా” అన్నారు.
సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ – “ఎంవీవీ సత్యనారాయణగారు మంచి వ్యక్తి. అలాగే కోన వెంకట్‌తో నాకున్న అనుబంధం తెలిసిందే. టాలెంట్ ఎక్కడున్నా, పట్టుకోవడంలో కోన స్పెషలిస్ట్. భానుకి ఈ సినిమాతో మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. నాగేశ్వర్ రెడ్డి మా సాగర్‌గారి దగ్గరే పనిచేశాడు. కామెడీ తీయడంలో ఆయనదొక కొత్త పంథా. మంచి మ్యూజిక్ సెన్స్ ఉన్న డైరెక్టర్. సందీప్, ఛోటాగారి మేనల్లుడు, అంటే నాకు మేనల్లుడితో సమానం. తను మంచి కథలను పిక్ చేసుకుంటూ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. హీరోయిన్ నేహాకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. రాజేంద్ర ప్రసాద్‌గారి గురించి తెలుగు వాళ్లు గర్వంగా చెప్పుకునే ఆర్టిస్ట్. ఇందులో ఆయన ఓ పిరికి కానిస్టేబుల్ పాత్రలో నటించాడు. ఇందులో వర్క్ చేసిన అందరికీ మంచి పేరు, డబ్బులు రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నందినీ రెడ్డి మాట్లాడుతూ – “ఈ సినిమాకు సంబంధించిన వారందరూ రౌడీలే. ఈ రౌడీలందరూ నాకు ఆప్తులే. ఎంవీవీగారు రాజకీయాల్లో ఉంటూ కూడా సినిమా ఇండస్ట్రీకి టైమ్ కేటాయించి మంచి సినిమాలను అందిస్తున్నారు. ఈ సినిమాకు ఆమెకు మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. కోనగారికి ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. నాగేశ్వర్ రెడ్డిగారు కరోనా టెన్షన్ నుంచి ఈ సినిమాతో రిలీఫ్ ఇస్తారని భావిస్తున్నాను. సందీప్..నా ఫ్రెండ్ రౌడీ. తనకు సినిమాలంటే ఎంత ఫ్యాషనో నాకు తెలుసు. రాజేంద్ర ప్రసాద్‌గారు ఈ సినిమాలో ఏదో మేజిక్ చేస్తారని అనుకుంటున్నాను. ఆయనతో మే నెల నుంచి ఓ సినిమా చేయబోతున్నాను” అన్నారు.
నటకిరిటీ డా.రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ “‘గల్లీ రౌడీ’లో అందరూ హాయిగా నవ్వుకునే కామెడీ ఉంటుంది. సందీప్‌కి ఇది ట్రైలర్ మేడ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. చాలా మంచి నటుడు. ఈ కథలో మా అందరి పాత్రలు చక్కగా లింకు అయ్యి ఉంటాయి. నాగేశ్వర్ రెడ్డిగారు మార్కు కామెడీతో సినిమా ఉంటుంది. అలాగే కోనతో తొలిసారి కలిసి పనిచేస్తున్నాను. లేడీస్ ట్రైలర్‌కు ఎంత మంచి అప్రిషియేషన్ వచ్చిందో ఈ సినిమాకు కూడా అంత మంచి అప్రిషియేషన్ వచ్చింది. హీరోయిన్ నేహాకు ఆల్ ది బెస్ట్. కరోనాలో హాయిని అందించే సినిమా మా గల్లీరౌడీ. మా ఎంవీవీ సత్యనారాయణ చాలా మంచి నిర్మాత. ఈ సినిమాతో ఆయనకు మరో సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ – “మా ‘గల్లీ రౌడీ’ మూవీ ఇది వరకు నేను, మా కోన వెంకట్ చేసిన గీతాంజలి కంటే చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను. కథ విన్న పది రోజుల్లోనే షూటింగ్‌ను స్టార్ట్ చేశాం. మంచి కామెడీ చిత్రాలను అందించిన దర్శకుడు నాగేశ్వర్ రెడ్డిగారి డైరెక్షన్‌లో సినిమా రూపొందింది. ఎంటైర్ యూనిట్ మంచి సపోర్ట్‌ను అందించారు. అనుకున్న బడ్జెట్‌ను సినిమాను పూర్తి చేశాం. సినిమా బిజినెస్ కూడా పూర్తయ్యింది. సినిమా తప్పకుండా మంచి హిట్ అవుతుంది. ఈ సినిమా హిట్ కాకపోతే నా జడ్జ్‌మెంట్‌లో రాంగ్ ఉన్నట్లే. నేను సినిమాలు చేయలేనెమో అన్నంతగా, నమ్మకంతో సినిమా సక్సెస్ గురించి చెబుతున్నాను. టెన్షన్, కామెడీ సమాంతరంగా నడుస్తుంటాయి” అన్నారు.
డైరెక్టర్ జి.నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ – “నేను కథను వినేటప్పుడు టెక్నీషియన్ కంటే ఆడియెన్‌గానే వింటాను. నా టీమ్ అందరికీ థాంక్స్. సినిమాను అరవై రోజుల్లో పూర్తి చేశాం. కోన వెంకట్‌గారు, రాజేంద్ర ప్రసాద్‌గారు వ్యసనంలా మారిపోయారు. వారు లేకపోతే నెక్ట్స్ సినిమా చేయలేం అనేంత దగ్గరయ్యారు. ఎంటైర్ యూనిట్ సినిమాను ప్రేమించి చేశాం. ఎంవీవీ సత్యనారాయణగారు ఫుల్ కో ఆపరేషన్‌ను అందించారు. చాలా మంచి నిర్మాత. ఆయనతో కలిసి వర్క్ చేయడం హ్యాపీ. సందీప్‌కు లవ్ యు. నేహా శెట్టి..బ్యూటీఫుల్ ఆర్టిస్ట్. వినాయక్‌గారికి, నందినీగారికి థాంక్స్” అన్నారు.
హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ – ” ఓ బలంతో ఇక్కడ నిలబడుతున్నాను. అందుకు కారణం ప్రేక్షకులే. వారు ఏ1 ఎక్స్‌ప్రెస్‌కు అందించిన విజయంతోనే ఈ సినిమా చేయడానికి నమ్మకం వచ్చింది. ఏ1 ఎక్స్‌ప్రెస్ సినిమా చేసేటప్పుడు ఓ చిన్న పాటి టెన్షన్ ఉండింది. ఆ సమయంలో ఓ హ్యాపీ మూవీ చేయాలనిపించింది. నాగేశ్వర్ రెడ్డిగారిని నేను బ్లైండ్‌గా నమ్ముతాను. ఆయన మాట వింటాను. ఆయన నిజాయతీగా ఉంటారు. ఆయన నన్ను నాకే కొత్తగా చూపిస్తారు. నాకు, కోనగారికి బ్యూటీఫుల్ రిలేషన్ షిప్ ఉంటుంది. ఆయనొక పని రాక్షసుడు.
ఓ సినిమాకు ఆయన పనిచేసేటప్పుడు అందరి కంటే ముందుగా ఆరు గంటలకు అక్కడుంటాడు. మా సినిమాటోగ్రాఫర్ ఎలాంటి బ్రేక్ లేకుండా పని చేశాడు. సినిమా విషయానికి వస్తే.. అందరూ నవ్వుకునే సినిమా. నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే సినిమాలో మా తాత రౌడీ.. మా నాన్న రౌడీ. నాకు రౌడీ కావడం ఇష్టముండదు. స్కూల్ నుంచి లాక్కొచ్చి రౌడీని చేస్తారు. రాజేంద్ర ప్రసాద్‌గారు భయస్తుడైన కానిస్టేబుల్ రోల్‌లో నటించారు.
ఆయన్ని చూస్తూ పెరిగాను. ఆయనతో కలిసి పనిచేయడం మెమొరబుల్ ఎక్స్‌పీరియెన్స్. హీరోయిన్ నేహాలో మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. భాను, నందు, సాయిలకు థాంక్స్. చక్కటి కథను కుదిరింది. నెక్ట్స్ సినిమాకు కూడా వాళ్లే కథను అందిస్తున్నారు. నిర్మాతగారు ఎంవీవీ సత్యనారాయణగారు, ఎంత పెద్ద పోజిషన్‌లో ఉన్నా కూడా డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయనతో కలిసి పనిచేయడం హ్యాపీ. బాబీ సింహా ఈ సినిమాలో చాలా కీ రోల్‌లో నటించాడు. తనకు నాకు మంచి ఫ్రెండ్. అడగ్గానే నటించినందుకు తనకు థాంక్స్. వినాయక్‌గారికి, నందినీ రెడ్డిగారికి థాంక్స్. వినాయక్‌గారు నాకు పెద్ద దిక్కు. నందినీ రెడ్డి నాకు మంచి ఫ్రెండ్. సినిమాను థియేటర్‌లో బాగా ఎంజాయ్ చేస్తారు” అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్, హీరోయిన్ నేహా శెట్టి, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్, సినిమాటోగ్రాఫర్ సుజాత సిద్ధార్థ్, రైటర్స్ భాను నందు తదితరులు పాల్గొన్నారు.