నకిలీ, డా.సలీమ్, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని. ఈయన హీరోగా.. మెట్రో వంటి డిఫరెంట్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ ఆనంద కృష్ణన్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘విజయ రాఘవన్’. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్ సమర్పణలో చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్.సంజయ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ వేసవిలో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం ఈ సినిమాలోని `తను చూసి నవ్వుకున్న…` అనే లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేసింది. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో…
హీరో విజయ్ ఆంటోని మాట్లాడుతూ – ”నాపై తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, ఆదరాభిమానాలకు ధన్యవాదాలు. ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్‌కు పక్కా లాభాలు వస్తాయని నమ్మకంగా చెబుతున్నాను. కోవిడ్ తర్వాత సినిమాను తెలుగు ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తున్నారు. క్రాక్, ఉప్పెన, జాతిరత్నాలు సహా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. ఆ చిత్రాల సరసన మా విజయ రాఘవన్ సినిమా కూడా చేరుతుందని భావిస్తున్నాను. దర్శకుడు ఆనంద కృష్ణన్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. మదర్ సెంటిమెంట్, ప్రేమ, రొమాన్స్, యాక్షన్ ఇలా అన్నీ ఎలిమెంట్స్‌ను పక్కాగా మిక్స్ చేసి సినిమాను రూపొందించాడు.
అందుకనే నేను చేస్తున్న నెక్ట్స్ మూవీ `బిచ్చగాడు 2` సినిమాను కూడా ఆయనకే దర్శకత్వ బాధ్యతలను అప్పగించాను. అలాగే నిర్మాతలు రాజాగారు, కమల్‌గారు, సంజయ్‌గారి సపోర్ట్‌తో సినిమాను ఈ పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాగలుగుతున్నాం. వేసవిలో సినిమాను విడుదల చేయబోతున్నాం. ఆత్మిక చాలా మంచి కో ఆర్టిస్ట్. అద్భుతంగా నటించింది. అలాగే బిచ్చగాడు సినిమా నుంచి నాతో అనుబంధం కొనసాగిస్తోన్న రైటర్ భాషా శ్రీగారు ఈ సినిమాకు మాటలు, పాటలు రాశారు. రామచంద్రరాజుగారిగో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. చాలా మంచి వ్యక్తి. ఆయనతో కలిసి మరిన్ని సినిమాలకు పనిచేయాలని అనుకుంటున్నాను. విజయ రాఘవన్ సినిమాను ఆదరిస్తారని భావిస్తున్నాను” అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన కమల్ బోరా మాట్లాడుతూ – “విజయ్ ఆంటోనిగారు టైటిల్ పాత్రలో నటించిన `విజయ రాఘవన్` సినిమాను సమ్మర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. డైరెక్టర్ ఆనంద కృష్ణన్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్“ అన్నారు.
డైరెక్టర్ ఆనంద కృష్ణన్ మాట్లాడుతూ – “`విజయ రాఘవన్` సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో విజయ్ ఆంటోనిగారు సహా.. రాజగారు, కమల్‌గారు, పంకజ్‌గారు, లలిత్‌గారు, సంజయ్‌గారు ఎంతగానో సపోర్ట్ చేశారు. అందుకే ఓ చక్కటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం. నేను ఇది వరకు డైరెక్ట్ చేసిన మెట్రో సినిమా కూడా తెలుగులో విడుదలైంది. ఇప్పుడు విజయ్ రాఘవన్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. మెట్రో సినిమా చూసిన విజయ్ గారు నాతో సినిమా చేయడానికి ఓకే చెప్పారు. కథ నెరేట్ చేయగానే వెంటనే ఓకే చెప్పేశారు. సినిమా ఔట్‌పుట్ కోసం పబ్లిక్ లొకేషన్స్‌లోనే చిత్రీకరణను పూర్తి చేశాం. విజయ్ ఆంటోనిగారు ఈ సినిమాకు ఎడిటర్‌గా కూడా తన వంతు సహకారాన్ని అందించారు. ఆత్మిక చక్కగా నటించింది. అలాగే రామచంద్రరాజుగారు విలన్ పాత్రలో ఒదిగిపోయారు. అలాగే తమిళ మాటలు, పాటలను తెలుగు నెటివిటీకి తగినట్లు భాషాశ్రీగారు చక్కగా రాశారు. ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం“ అన్నారు.
రైటర్ భాషా శ్రీ మాట్లాడుతూ – “`విజయ రాఘవన్` గురించి చెప్పాలంటే ఇది యూత్ మాస్ ఎంటర్‌టైనర్. ఇప్పుడు అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. అరవై శాతం పనులు పూర్తయ్యాయి. ఎంటైర్ యూనిట్ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈసారి పక్కా మరో హిట్ కొడుతున్నాం. మాస్, లవ్, రొమాన్స్, యాక్షన్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న సినిమాగా డైరెక్టర్ ఆనంద కృష్ణన్ సినిమాను హైదరాబాదీ బిర్యానీలా మలిచారు. హీరోయిన్ ఆత్మిక చూడటానికి మరో సమంతలా అనిపించింది. అంతే కాదు.. అంత మంచి నటనను కూడా కనపరిచింది. ఈ సినిమాకు పనిచేసే అవకాశం కలిగించిన దర్శక నిర్మాతలకు థాంక్స్“ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు రామచంద్రరాజు, హీరోయిన్ ఆత్మిక కూడా పాల్గొని సినిమా సక్సెస్ కావాలని అభిలషించారు. విజయ్ ఆంటోని, ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి మ్యూజిక్: నివాస్ కె.ప్రసన్న, సినిమాటోగ్రఫీ: ఎన్.ఎస్.ఉదయ్‌కుమార్, ఎడిటర్: లియో జాన్ పాల్, సహ నిర్మాతలు: కమల్ బోరా, లలిత ధనంజయన్, బి.ప్రదీప్, పంకజ్ బోరా, ఎస్.విక్రమ్ కుమార్, నిర్మాతలు: టి.డి.రాజా, డి.ఆర్. సంజయ్ కుమార్, రచన, దర్శకత్వం: ఆనంద కృష్ణన్.