* ‘జెర్సీ’కి హీరో నాని, డైరెక్టర్ గౌతమ్ చాలా కష్టపడ్డారు* బాబాయ్ రమ్మంటే సాఫ్ట్‌వేర్ నుంచి సినిమాల్లోకి వచ్చాను* ‘రంగ్ దే’ ఫస్టాఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో, సెకండాఫ్ ఎమోషన్స్‌తో అలరిస్తుంది
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘జెర్సీ’ మూవీ 2019 జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా పురస్కారాన్ని గెలుచుకొని సగర్వంగా నిలిచింది.
అలాగే ఈ చిత్రానికి పనిచేసిన నవీన్ నూలి ఉత్తమ ఎడిటర్‌గా అవార్డును పొందారు. ఈ రెండు పురస్కారాలు తెచ్చిన ఆనందాన్ని ఆస్వాదిస్తూనే.. మార్చి 26న విడుదలవుతున్న ‘రంగ్ దే’ చిత్రం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు నాగవంశీ. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో సమావేశమైన ఆయన ‘జెర్సీ’ సినిమా విశేషాలను పంచుకోవడంతో పాటు, ‘రంగ్ దే’ మూవీ సంగతులు, భవిష్యత్ ప్రాజెక్టుల గురించి విపులంగా మాట్లాడారు. ఆ విషయాలు..
‘జెర్సీ’కి రెండు జాతీయ అవార్డులు వచ్చినందుకు ముందుగా అభినందనలు. ఈ అవార్డులు రావడం ఎలా అనిపిస్తోంది?’జెర్సీ’కి అవార్డులు వస్తాయని ఊహించాం. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది జాతీయ అవార్డులు లేకపోయేసరికి వాటి గురించి మర్చిపోయాం. కానీ ఇప్పుడు హఠాత్తుగా ప్రకటించేసరికి ఆశ్చర్యమూ, ఆనందమూ రెండూ కలిగాయి. తొలిసారి మా సినిమాకు జాతీయ అవార్డులు రావడం సంతోషంగా అనిపిస్తోంది. ఆ సినిమా కోసం హీరో నాని చాలా ఎఫర్ట్ పెట్టారు, బాగా కష్టపడ్డారు. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి పడిన కష్టం కూడా చిన్నదేమీ కాదు.
‘జెర్సీ’ తీయాలని ఎందుకనిపించింది?గౌతమ్ ఈ కథ చెప్పినప్పుడు బాగా నచ్చేసింది. బేసికల్‌గా నాకు క్రికెట్ అంటే ఇష్టం. ఆ నేపథ్యం ఉన్న కథ కావడం, మంచి భావోద్వేగాలు ఉండటంతో కనెక్టయ్యాను. నానితో ఈ సినిమా చేయాలనుకున్నాడు గౌతమ్. అయితే ఏడు సంవత్సరాల కొడుకు ఉన్న తండ్రి కథని నాని ఒప్పుకుంటారా, లేదా అని సందేహించాం. కానీ వినగానే నాని ఈ కథను నమ్మారు. ఏమాత్రం సందేహించకుండా ఏడేళ్ల కొడుకున్న తండ్రిగా సూపర్బ్‌గా నటించారు.
అవార్డులు రావడం సరే.. కమర్షియల్‌గా ఈ సినిమాకు మీకు సంతృప్తినిచ్చిందా?ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టకుంటే చాలు అంటుంటారు బాబాయ్ (నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు). కథలో మేం ఎంటర్‌టైన్‌మెంట్, హ్యూమన్ ఎమోషన్స్‌కు ప్రాధాన్యం ఇస్తుంటాం. జెర్సీ కథలో కమర్షియల్ యాంగిల్ తక్కువే అయినా అందులోని ఎమోషన్స్‌ను నాని, నేను బాగా నమ్మాం కాబట్టే ఆ సినిమా చేశాం. రాయలసీమ, గుంటూరు ఏరియాలు మినహా.. ఓవర్సీస్ సహా అన్ని చోట్లా కమర్షియల్‌గా బాగా ఆడింది. రెండో వారం హాలీవుడ్ ఫిల్మ్ ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ రావడంతో కలెక్షన్లపై ప్రభావం పడింది. అయినప్పటికీ బాగానే ఆడింది.
ఈ రెండు అవార్డులే కాకుండా వేరే అంశాల్లో అవార్డులు వస్తాయని ఆశించారా?బెస్ట్ యాక్టర్‌గా నానికి, బెస్ట్ డైరెక్టర్‌గా గౌతమ్‌కు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వస్తాయని నేను నమ్మాను. అయితే ఇప్పుడు రెండు అంశాల్లో నేషనల్ అవార్డ్స్ రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకు ‘జెర్సీ’ సినిమా పూర్తిగా అర్హమైంది.
ఇండస్ట్రీ నుంచి ఎలాంటి స్పందన లభించింది?ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది అభినందనలు తెలిపారు. కొంతమంది ఫోన్ల ద్వారా, కొంతమంది సోషల్ మీడియా ద్వారా అభినందించారు. అందరికీ పేరు పేరు న కృతజ్ఞతలు.
మీ సినిమాతో పాటు ‘మహర్షి’ చిత్రానికీ రెండు అవార్డులు లభించడంపై మీ స్పందన?చాలా ఆనందంగా ఉంది. ‘మహర్షి’ సినిమాని మంచి కాన్సెప్ట్‌తో తీశారు. రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే ఏం చేయాలనే కథకి మహేష్‌బాబు గారు తన పర్ఫార్మెన్స్‌తో గొప్ప న్యాయం చేశారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి చాలా బాగా దాన్ని రూపొందించారు. ‘మహర్షి’ టీమ్ మొత్తానికీ మా సంస్థ తరపున అభినందనలు తెలియజేస్తున్నా.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌లో మీ పాత్ర ఎంతవరకు ఉంటుంది?హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుకు రెండు బ్యానర్లయినా, నా వరకు అవి రెండూ ఒకటే. చెప్పాలంటే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పేరిట నిర్మించే సినిమాల్లోనే నా ఇన్‌వాల్వ్‌మెంట్ ఎక్కువ ఉంటుంది. హారిక, హాసిని అనేవి మా చెల్లెళ్ల పేర్లు. ఆ ఇద్దరి పేరిట హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పేరును త్రివిక్రమ్ గారు పెట్టారు. సాధారణంగా నా దగ్గరకు ఏదైనా కథ వచ్చి, అది నాకు నచ్చితే బాబాయ్ (ఎస్. రాధాకృష్ణ) దగ్గరకు పంపిస్తాను. ఆయనకూ నచ్చితే అప్పుడు ప్రాజెక్ట్ మొదలుపెడతాం.
సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ నుంచి వచ్చారు కదా.. సినీ నిర్మాణం సంతోషాన్నిస్తోందా?నేను సాఫ్ట్‌వేర్ రంగం నుంచి సినీ రంగంలోకి రావడానికి కారణం మా బాబాయే. సహజంగానే నాకు సినిమాలంటే చిన్నప్పట్నుంచీ ఇష్టం. నిర్మాతల్లో నాకు దిల్ రాజు గారంటే చాలా అభిమానం. ఆయన స్వయంకృషితో ఈ రంగంలోకి వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగారు. బాబాయ్ నిర్మాతగా సినిమాల్లోకి వచ్చాక, నన్ను కూడా రమ్మనేసరికి సంతోషంగా వచ్చేశాను. ఇప్పుడు మంచి సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలుగా మా బ్యానర్లకు పేరు రావడం మరింత ఆనందంగా ఉంది.
‘రంగ్ దే’ గురించి ఏం చెబుతారు?’రంగ్ దే’ సినిమా యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇంజనీరింగ్ చదివిన 24 సంవత్సరాల కుర్రాడి కథ. ఈ కథలోనూ మంచి మానవ భావోద్వేగాలుంటాయి. ప్రధమార్ధం వినోదాత్మకంగా ఉల్లాసంగా నడిస్తే, ద్వితీయార్ధం చివరి నలభై నిమిషాలలో భావోద్వేగాలు మనసుల్ని ఆకట్టుకుంటాయి. నితిన్ నటన అందర్నీ అలరిస్తుంది.
షూటింగ్ కోసం ఇటలీకి వెళ్లాలనుకున్నారు కదా.. దుబాయ్‌కి మార్చారెందుకని?కథ ప్రకారం ఇటలీకి వెళ్లాలి. కానీ కొవిడ్ వల్ల షూటింగ్‌ను దుబాయ్‌కి మార్చాం. కథలోనూ బ్యాక్‌డ్రాప్‌ను దుబాయ్‌నే పెట్టాం. అక్కడ షూటింగ్ మంచి ఆహ్లాదకర వాతావరణంలో స్మూత్‌గా జరిగింది.
జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఎప్పటి నుంచి ఉంటుంది?ఏప్రిల్ నెలాఖరు లేదా మే మొదటి వారంలో షూటింగ్ మొదలవుతుంది.
‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ షూటింగ్ గురించి ?ఈ చిత్రం ఇద్దరు వ్యక్తుల ఇగోల నేపథ్యంలో నడిచే కథ. ఒరిజినల్ తరహాలోనే తెలుగులోనూ ఆ క్యారెక్టరైజేషన్స్ అలాగే ఉంటాయి. కొన్ని సన్నివేశాలను మార్చడం, లేదా కలపడం జరిగింది.
డైరెక్టర్‌గా సాగర్‌చంద్రను తీసుకొని, స్క్రిప్ట్ కోసం త్రివిక్రమ్ గారిని తీసుకొచ్చారెందుకని?సాగర్‌చంద్ర డైరెక్షన్ స్కిల్స్ మీద నమ్మకంతోనే ఆయనను డైరెక్టర్‌గా తీసుకున్నాం. అయితే పవన్ కల్యాణ్ గారు, రానా గారు నటిస్తుండటంతో, ప్రాజెక్ట్ పెద్దదైపోయింది. దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసమే త్రివిక్రమ్ గారు స్క్రిప్ట్‌లోకి వచ్చారు. ఆయన స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ సినిమాకి బలమవుతాయి.
హీరోయిన్లు ఎవరు?పవన్ కల్యాణ్ గారి సరసన హీరోయిన్‌గా ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు. రానా జోడీగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తోంది.
మీ బ్యానర్ మీద తర్వాత వచ్చే సినిమాలేమిటి?సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద తర్వాత వచ్చే సినిమా ‘వరుడు కావలెను’. మలయాళం హిట్ సినిమా ‘కప్పేలా’ రీమేక్‌ను ‘బుట్టబొమ్మ’ టైటిల్‌తో చేద్దామనుకుంటున్నాం. ‘నరుడి బ్రతుకు నటన’ అనే సినిమా షూటింగ్ జరుగుతోంది. బెల్లంకొండ సురేష్ గారి చిన్నబ్బాయి గణేష్‌బాబు హీరోగా ఓ సినిమా చేస్తున్నాం.
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి కదా.. సినిమాపై దీని ఎఫెక్ట్ పడుతుందని ఆందోళన చెందుతున్నారా?కరోనా గురించి ఇదివరకటిలా ఇప్పుడంత భయపడాల్సిన పనిలేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. వైరస్‌లో తీవ్రత తగ్గింది. కేసులు వస్తున్నప్పటికీ ఆందోళన చెందాల్సింది లేదు. మళ్లీ లాక్‌డౌన్‌లు విధిస్తారని నేననుకోను. పెద్దవాళ్లు ఇప్పటికే వాక్సిన్ వేసుకుంటున్నారు.
థియేటర్లు తెరుచుకున్నాక వరుసగా సినిమాలు హిట్టవుతుండటంపై ఏమంటారు?2020లో అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలు మంచి హిట్టయ్యాక.. లాక్‌డౌన్ వచ్చింది. ఈ సంవత్సరం థియేటర్లు ఓపెన్ అయ్యాక చాలా సినిమాలు హిట్టవడం, ఊహించిన దానికి మించి కలెక్షన్లు వస్తుండటం ఇండస్ట్రీకి శుభ పరిణామం. ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాం.