కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక 67వ జాతీయ చలన చిత్రాల అవార్డులను ప్రకటించింది. ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల్లో తెలుగు మరియు తమిళ సినిమాలు సత్తా చాటాయి. తెలుగు ఇండస్ట్రీ నుండి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జెర్సీ నిలిచింది. ఇక ఉత్తమ ప్రజాధరణ దక్కించుకున్న సినిమాగా మహేష్ బాబు మహర్షి సినిమా నిలిచింది. అలాగే జెర్సీ సినిమాకు ఎడిటింగ్ కు గాను ఉత్తమ ఎడిటర్ అవార్డును నవీన్ నూలి దక్కించుకున్నారు. మహర్షి సినిమా కొరియోగ్రాఫర్ రాజు సుందరంకు ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు దక్కింది. తెలుగు సినిమాలు వరుసగా జాతీయ అవార్డులను దక్కించుకోవడం పట్ల ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక తమిళ ఉత్తమ సినిమాగా ధనుష్ నటించిన అసురన్ నిలవడం జరిగింది. తెలుగు మరియు తమిళం కు చెందిన పలు సినిమాలు ఈసారి జాతీయ అవార్డు జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జెర్సీ కి జాతీయ అవార్డు రావడం పట్ల చిత్ర యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమా రూపొందింది. దర్శకుడిగా గౌతమ్ తిన్ననూరి దక్కించుకున్న గుర్తింపు అంతా ఇంతా కాదు. ఇప్పుడు జాతీయ అవార్డు రావడంతో ఆయన రేంజ్ మరింతగా పెరిగింది. కొన్ని రోజుల క్రితం ఆయన దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు జెర్సీకి జాతీయ అవార్డు వచ్చిన నేపథ్యంలో చరణ్ ఆ సినిమా ను చేసే అవకాశం ఉందని అంటున్నారు.