తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన మాస్టర్ సినిమా గత ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కాని కరోనా కారణంగా సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. ఓటీటీకి ఇవ్వబోతున్నారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. కాని అవి నిజం కాదని ఆ తర్వాత వెళ్లడి అయ్యింది. థియేటర్ల ఓపెన్ కు కేంద్రం ఓకే చెప్పడంతో చిత్ర యూనిట్ సభ్యులు సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు ‘మాస్టర్’ ను తీసుకు వచ్చింది.
కథః ప్రతిభావంతుడు అయిన ప్రొఫెసర్ జేడీ(విజయ్) అంటే స్టూడెంట్స్ అందరికి అభిమానం. ఆయన మాట ప్రకారం అంతా నడుచుకుంటూ ఉంటారు. అయితే జేడీ మాత్రం తాగుబోతు. ప్రతి సారి తాగేసి కాలేజ్ కు వస్తూ ఉంటాడు. అయినా కూడా స్టూడెంట్స్ కు ఆయన అంటే అభిమానమే. జేడీ అనుకోకుండా ఒక సమస్య కారణంగా బాల నేరస్తులకు ట్రైనింగ్ ఇచ్చే శిక్షణ కేంద్రంకు బదిలి అవుతాడు. అక్కడ ఉన్న వారు అంతా కూడా చాలా తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. వారిని భవాని(విజయ్ సేతుపతి) నడిపిస్తూ ఉంటాడు. బాల నేరస్తులను భవాని నుండి ఎలా బయటకు తీసుకు వచ్చి వారిని మంచి మార్గంలో జేడీ పెట్టాడు అనేది కథగా చూపించారు.
విశ్లేషణః సినిమా మొత్తంను కూడా విజయ్ మరియు విజయ్ సేతుపతిలు ఇద్దరు తమ బుజాలపై వేసుకుని మోశారు. అద్బుతమైన కథ ను లోకేష్ ఎంపిక చేసుకున్నాడు. కాని దాన్ని కథనంగా మార్చే క్రమంలో కాస్త అటు ఇటు అయ్యింది. ప్రేక్షకులు ఆశించిన రేంజ్ లో విజయ్ ను చూపించలేదు. దానికి తోడు ఇద్దరు విజయ్ ల మద్య సన్నివేశాలను ట్రైలర్ మరియు టీజర్ లో ఓ రేంజ్ లో చూపించారు. సినిమాలో మాత్రం ఆ స్థాయిలో లేకపోవడం కాస్త నిరుత్సాహం కలిగించే విషయం. హీరోయిన్ తో పాటు ఇతర నటీనటులకు ఎవరికి కూడా పెద్దగా ప్రముఖ్యత లేదు. సినిమాటోగ్రఫీ కొన్ని సీన్స్ లో బాగుంది. కాని ఎక్కువ శాతం సాదా సీదాగానే ఉంది. ఇక దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన గత సినిమా ఖైదీ లో అద్బుతంగా స్క్రీన్ ప్లే నడిపించాడు. కాని ఈ సినిమాలో మాత్రం ఆ రేంజ్ లో లేదని చెప్పాలి. విజయ్ గత సినిమాల మాదిరిగానే ఇది కూడా మాస్ మసాలా సినిమాలా అనిపించింది కాని కొత్తగా ప్రత్యేకంగా ఏమీ లేదు. మొత్తంగా మాస్టర్ సినిమా ఒక మోస్తరుగానే ఉంది. దీని తర్వాత లోకేష్ కనగరాజ్ కమల్ హాసన్ తో సినిమా తీస్తున్నాడు. మరి అది ఎలా ఉంటుందో అనే అనుమానాలు ఇప్పటి నుండే మొదలు అయ్యాయి.
ప్లస్ పాయింట్స్‌ః
విజయ్ మరియు విజయ్ సేతుపతి ల నటన
ఇంటర్వెల్ బ్లాక్
అనిరుథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్‌ః
కథ, కథనం,
సెకండ్ హాఫ్,
రన్ టైం ఎక్కువ అయ్యింది
ఎడిటింగ్ లో లోపాలు
చివరగాః ‘మాస్టర్’ కంటే మరేదైనా ఈ సంక్రాంతికి ఎంపిక చేసుకుటే బెటర్.
రేటింగ్‌ః 2.5/5.0