మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అనగానే వైష్ణవ్ తేజ్ పై అంచనాలు భారీగా ఉంటాయి. అలాంటి హీరోను తీసుకున్న బుచ్చి బాబు తన గురువు సుకుమార్ దారిలో ఒక క్యూట్ లవ్ స్టోరీని తెరకెక్కించేందుకు సిద్దం అయ్యాడు. ఉప్పెన అంటూ మొదటి నుండి సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాడు. సినిమాపై మొదటి నుండి కూడా పాజిటివ్ టాక్ ఉంది. కనుక సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే అంతా అనుకున్నారు. సుకుమార్ ఈ సినిమా వంద కోట్ల సినిమా అంటూ వ్యాఖ్యలు చేశాడు. మరి ఆ రేంజ్ లో ఈ సినిమా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథః
ఎన్నో సినిమాల్లో చూసినట్లుగానే ఇదో రొటీన్ లవ్ స్టోరీనే. అయితే కథను కాస్త విభిన్నంగా ప్రజెంట్ చేసేలా దర్శకుడు ప్లాన్ చేశాడు. కథలోకి వెళ్తే.. ఆశీర్వాదం అలియాస్ ఆశీ(వైష్ణవ్ తేజ్) సముద్ర తీరంలో జాలరిగా జీవనం సాగిస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుండి కూడా బేబమ్మ (కృతిశెట్టి) ని ప్రేమిస్తూ ఉంటాడు. కాలేజ్ కు వెళ్లే బేబమ్మ తనను ప్రేమిస్తున్న ఆశీని ప్రేమిస్తుంది. వీరిద్దరు ఒక రోజు రాత్రి సముద్రం మద్యకు వెళ్తారు. ఆ విషయం బేబమ్మ తండ్రి రాయనం(విజయ్ సేతుపతి)కి తెలుస్తుంది. అత్యంత కఠినాత్ముడు అయిన రాయనం తన కూతురును ప్రేమించిన ఆశీ పట్ల ఎలా వ్యవహరిస్తాడు అనేది సినిమా కథ.
విశ్లేషణః
దర్శకుడు బుచ్చి బాబు మొదటి నుండి కూడా ప్రాణం పెట్టి సినిమాను తీసినట్లుగా చెప్పుకొచ్చాడు. అన్నట్లుగానే ప్రతి ఫ్రేమ్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. దర్శకుడు హీరో హీరోయిన్ ఇద్దరు కొత్త వారే అయినా కూడా ఇద్దరి నుండి కూడా మంచి నటనను రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. దర్శకుడు బుచ్చి బాబు అభిరుచికి తగ్గట్లుగా సింపుల్ గా స్వీట్ గా సహజంగా సన్నివేశాలు ఉన్నాయి. వైష్ణవ్ తేజ్ నుండి మంచి నటన రాబట్టుకోవడంలో ఈయన సక్సెస్ అయ్యాడు. ఇక హీరోయిన్ కృతి శెట్టి బేబమ్మ పాత్రకు ప్రాణం పోసినట్లుగా అనిపించింది.
మొత్తానికి ఈ సినిమా ఓ రేంజ్ లో లేవడానికి వీరి నటన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక సినిమాను మరో స్థాయికి తీసుకు వెళ్లేలా విజయ్ సేతుపతి నటన ఉంది. ఆయన అద్బుత నటనతో సినిమా స్థాయిని పెంచేశాడు. సినిమాలోని చిన్న చిన్న ఎలిమెంట్స్ ను కూడా డీటైల్డ్ గా చూపించి మెప్పించాడు. పాటల విషయంలో దర్శకుడి అభిరుచి ముందే తేలిపోయింది. ఇక సముద్రపు అందాలను దర్శకుడు చక్కగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఆసక్తిగా ఎంటర్ టైన్ మెంట్ గా సాగింది.
సెకండ్ హాఫ్ ప్రారంభంలో కాస్త ఇబ్బందిగా ఉన్నా మొత్తానికి కథ ముందుకు సాగుతుంటే ఆసక్తిగా మారింది. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా ముగించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. కఠినాత్ముడు అయిన రాయనం అంత సింపుల్ గా మారడం అనేది ఎంత వరకు కరెక్ట్ అనే విధంగా ఉంది. మొత్తంగా అయితే ఉప్పెన ఒక మంచి ఫీల్ గుడ్ అవార్డ్ విన్నింగ్ మూవీ అనడంలో సందేహం లేదు.
ప్లస్ పాయింట్స్ :
హీరో హీరోయిన్ నటన,
విజయ్ సేతుపతి నటన,
స్క్రీన్ ప్లే,
పాటలు.
మైనస్ పాయింట్స్ :
క్లైమాక్స్,
సెకండ్ హాఫ్ లో కాస్త సాగతీసినట్లుగా ఉన్న సీన్స్,
ఎడిటింగ్
చివరగా..
క్లైమాక్స్ తప్ప మొత్తం కన్విన్సింగ్ గా ఉంది.
రేటింగ్ : 2.75/5.0