కరోనా లాక్డౌన్ కారణంగా దాదాపు ఏడు నెలలు థియేటర్లు పూర్తిగా మూతపడే ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు మెల్ల మెల్లగా కుదుట పడుతున్న కారణంగా కరోనా విషయంలో జనాలకు అవగాహన వచ్చిన కారణంగా థియేటర్లను అన్ లాక్ చేయాలనే నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చేసింది. ఇక ఆ విషయమై రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు థియేటర్లను కేంద్రం ఇచ్చిన మార్గ దర్శకాలకు లోబడి ఓపెన్ చేసుకోవచ్చు అంటూ అధికారికంగా ప్రకటించింది.
ఏపీ నుండి వచ్చిన ప్రకటనతో థియేటర్ల యాజమాన్యాలు మరియు తెలుగు సినిమా ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. కాని తెలంగాణా లో మాత్రం ఇప్పటి వరకు ఆ స్పష్టత రాలేదు. టీ ప్రభుత్వం నుండి స్పష్టత కోసం థియేటర్ల యాజమాన్యాలు వెయిట్ చేస్తున్నాయి. తెలంగాణలో కరోనా కేసులు భారీగానే ఉన్నాయి. ఈ నేపద్యంలో కరోనాకు భయపడి ప్రభుత్వం థియేటర్లకు అనుమతి ఇస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
థియేటర్ల యాజమాన్యాలు మాత్రం ఇప్పటికే ఏడు నెలలుగా నష్టపోతున్నాం ఇంకా థియేటర్లు మూసివేసి ఉంటే ఇక శాశ్వతంగా థియేటర్లను మూసేయాల్సిందే అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి కోసం అయినా థియేటర్లను ఓపెన్ చేసుకోవచ్చు అంటూ తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల వారు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.