బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య విషయం చిలికి చిలికి గాలి వాన మాదిరిగా అయ్యింది. ఆత్మహత్య కాదు హత్య అంటూ చాలా మంది బలంగా వాదిస్తున్నారు. కుక్క బెల్ట్‌తో అతడిని పీక పిసికి చంపేసి ఆ తర్వాత దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అనేది చాలా మంది బలమైన వాదన.
ఈ సమయంలో సుశాంత్ కేసును ముంబయి పోలీసులు విచారించిన తీరు పలువురికి అనుమానాలు కలిగించింది. వారు చాలా లైట్‌గా తీసుకుని ఈ కేసును విచారించినట్లుగా అనిపించింది. దాంతో బీహార్ పోలీసులు ఈ కేసును టేకోవర్ చేయాలంటూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు ఇచ్చాడు. అక్కడి నుండి ఈ కేసుకు సంబంధించి అసలు కథ మొదలయ్యింది.
బీహార్ పోలీసులు ఎంటర్ అవ్వడంపై ముంబయి పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసును వారికి అప్పగించేందుకు ససేమేరా అన్నారు. దాంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ కేంద్రంకు సిఫార్సు చేయడం జరిగింది. కేంద్రం కూడా సీబీఐకి కేసును ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. కాని మహారాష్ట్ర మాత్రం ఈ కేసును సీబీఐకి అప్పగించేది లేదు అంటూ పట్టుబట్టింది.
ఎట్టి పరిస్థితుల్లో ముంబయి పోలీసులు ఈ కేసును ఛేదిస్తారని నమ్మకం ఉంచాలని కేంద్రం వద్ద వాదించడం జరిగింది. ఈ సమయంలో సుశాంత్ సోదరి శ్వేత సింగ్ ఇంకా ప్రముఖులు ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిందే అంటూ డిమాండ్ చేయడం మొదలు పెట్టారు.
సుప్రీం కోర్టుకు కూడా వెళ్లిన ఈ వివాదంలో కీలక తీర్పు వచ్చింది. ఈ కేసునును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో నేడు సీబీఐ టీం రంగంలోకి దిగబోతుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నేడు ముంబయి పోలీసులు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సీబీఐకి అప్పగించాల్సిన అవసరం ఉంది.
ఈ కేసును ఎన్నో ఛాలెంజింగ్ కేసులను డీల్ చేసిన ఆఫీసర్‌కు అప్పగిస్తూ సీబీఐ ప్రకటించింది. ఈ విషయంలో సుశాంత్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పటికి అయినా అసలు నిజాలు బయటకు వస్తాయేమో అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రియా చక్రవర్తిపై సుశాంత్ కుటుంబ సభ్యులకు అనుమానం ఎక్కువగా ఉంది. త్వరలో సీబీఐ వారు సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు అయిన రియాను ప్రశ్నించే అవకాశం ఉందంటున్నారు.