తెలుగు సినిమా నుంచి మొదలైన రాజమౌళి ప్రస్థానం ఇప్పుడు ప్రపంచ స్థాయికి చేరింది. ఇండియన్ సినిమా కలలు కన్న 1000 కోట్ల కలెక్షన్స్ సాధించి చూపించాడు రాజమౌళి. దర్శకుడు రాజమౌళి సినీ ప్రస్థానం మొదలై 20 ఏళ్లు గడుస్తోంది. 2001లో స్టూడెంట్ నంబర్ 1 సినిమా విడుదలైంది. అప్పటి నుంచి అప్రతిహత విజయాలతో రాజమౌళి దూసుకుపోతున్నారు. తీసిన ప్రతి చిత్రం హిట్ కొడుతూ కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలను తీర్చిదిద్దారు. ఆయన తీసిన సినిమాలు రాజమౌళిని దేశంలోనే నంబర్ వన్ దర్శకుడిగా ఎదిగేలా చేశాయి.
రాజమౌళి సక్సెస్ లో ఆయన కుటుంబం పాత్ర ఎంతో కీలకం. ఎందుకంటే రాజమౌళి తీసిన సినిమాలకు చీఫ్ టెక్నిషియన్స్ గా ఆయన కుటుంబ సభ్యులే ఉంటారు. రాజమౌళి సినిమాలకు మొదటి నుంచి కీరవాణి మాత్రమే సంగీతం అందిస్తుంటారు. అలాగే.. ఆయన సతీమణి రమా రాజమౌళి క్యాస్టూమ్ డిజైన్ చేస్తారు. ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తారని అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడూ రాజమౌళి ఆయన కుటుంబసభ్యుల గురించి వెల్లడించలేదు. మొదటి సారి ఒక్కొక్కరి గురించి విపులంగా చెప్పారు.
విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తారని అందరికీ తెలిసిందే. అయితే జక్కన్న కజిన్ అయిన ఎస్.ఎస్.కాంచి కూడా స్క్రిప్టు తయారీలో కీలకంగా వ్యవహరిస్తారని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. సినిమా మేకింగ్ విషయంలో కీరవాణి భార్య శ్రీవల్లి చాలా కీలకంగా ఉంటారు. అలాగే కొడుకు కార్తికేయ చాలా పనుల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంటాడు. భార్య రమ కాస్ట్యూమ్స్ బాధ్యత తీసుకుంటుంది.
సంగీత పరంగా కీరవాణి అద్భుతమైన ఔట్ పుట్ ఇస్తారు. ఆయన తమ్ముడు కల్యాణి మాలిక్ తన వంతు సాయం చేస్తాడు. ఎవరి ప్రొడక్షన్ లో సినిమా చేసినా.. ఇలా కుటుంబం అంతా మన సినిమా అనే ఉద్దేశంతోనే పని చేస్తారు. ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో ఈ విషయాలను వారి కృషిని కొనియాడారు రాజమౌళి. ఆయన కుటుంబంలో ప్రతి ఒక్కరి గురించి ఎంతో చెప్పారు. సినిమా పక్కదారి పట్టకుండా ప్రతి ఒక్కరూ వాచ్ డాగ్ ల కనిపెడుతూ ఉంటారని అందుకే తన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పారు రాజమౌళి.