తెలుగుతో పాటు ఎన్నో భాషల్లో వేల కొద్ది పాటలను పాడి మెప్పించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా పాజిటివ్ అంటూ గత నెలలో ఆసుపత్రిలో జాయిన్ అయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆయన కరోనా వల్ల శ్వాస తీసుకోలేక పోతున్నట్లుగా వైధ్యులు ప్రకటించి ఐసీయూకి తరలించారు. అప్పటి నుండి బాలు ఆరోగ్య విషయంలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ సమయంలోనే ఆయన ఆరోగ్యం మరింతగా విషమించింది అంటూ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.
మీడియాలో వస్తున్న వార్తలతో అంతా ఆందోళన చెందారు. సోషల్ మీడియా పుకార్లు రకరకాలుగా రావడంతో ప్రతి రోజు బాల సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు మరియు వైధ్యులు ప్రతి రోజు బులిటెన్ విడుదల చేస్తున్నారు. మూడు వారాలుగా బాలు ఆరోగ్యం కుదుట పడలేదు అంటూ చెబుతూ వచ్చారు. ఎట్టకేలకు బాలసుబ్రమణ్యం తనయుడు ఎస్పీ చరణ్ నాన్నకు కరోనా నెగటివ్ వచ్చిందని ప్రకటించాడు. అయితే ఊపిరితిత్తుల్లో ఉన్న ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఇంకా ఐసీయూలోనే ఉన్నాడు అంటూ పేర్కొన్నారు.
త్వరలోనే ఆయన వెంటిలేటర్ నుండి బయటకు వచ్చి సహజంగా శ్వాస తీసుకుంటారనే నమ్మకంను వైధ్యులు పేర్కొన్నారు. నేడు బాలు పెళ్లి రోజు అవ్వడంతో ఆసుపత్రిలోనే అందుకు సంబంధించిన కార్యక్రమం నిర్వహించారట. ఇక బాలు గారు తన ఐపాడ్ లో క్రికెట్ మరియు టెన్నీస్ చూశారు. ఐపీఎల్ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా పేర్కొన్నాడు.
గత కొన్ని రోజులుగా బాలు గారు తన పాటలను వినడంతో పాటు ప్రతిదానికి స్పందిస్తున్నారు అంటూ చరణ్ పేర్కొన్నాడు. దాంతో దేశ వ్యాప్తంగా ఉన్న బాలు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. వారం పది రోజుల్లో బాలు గారు ఇంటికి వెళ్లడం ఖాయం అంటున్నారు. కరోనాను జయించి ఆయన మరో రెండు మూడు నెలల్లో పాటలు కూడా పాడటం కోసం ఎదురు చూస్తున్నారంటూ చరణ్ పేర్కొన్నారు.