ఎట్టకేలకు సూపర్ స్టార్ రజనీకాంత్ తన రాజకీయ ప్రవేశం ఫై అధికారిక క్లారిటీ ఇవ్వడం తో తమిళనాట సంబరాలు మొదలయ్యాయి. ఈ నెల 31వ తేదీన రాజకీయ పార్టీ ప్రకటన చేస్తున్నట్లు రజని తెలిపారు. సమయం దగ్గర పడుతుండడం తో ఆ పనుల్లో రజని బిజీ అయ్యారు. ఇప్పటికే పార్టీ ముఖ్యులు అర్జున్‌మూర్తి, తమిళరివి మణియన్ మక్కల్ మండ్రం జిల్లాల కార్యదర్శులతో రజని భేటీ అవడం జరిగింది.
ఈ నేపథ్యంలో ఈ నెలాఖరున ప్రకటించే పేరు, గుర్తు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. రజినీకాంత్ తన కొత్త పార్టీకి ‘మక్కల్ సేవై కర్చీ'( ప్రజాసేవ పార్టీ ) అనే పేరు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే పార్టీకి ఆటో గుర్తును ఎలక్షన్ కమిషన్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. రజనీకాంత్ నటించిన భాషా సినిమాలో ఆటో డ్రైవర్‌గా కనిపించారు. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా ఆయనకు ఎంతో గుర్తింపు వచ్చింది.
ఈ క్రమంలోనే ఆయన తన ఎన్నికల గుర్తుగా ఆటోను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో రజనీకాంత్ సిఎం అయ్యే ఉద్దేశం ఏమాత్రమూ లేదని, సీఎం బాధ్యతలను దీర్ఘదృష్టి, చతురత కలిగిన ఓ యువనాయకుడికి కట్టబెట్టాలని గతంలో ఆయన కామెంట్ చేశారు. అయితే తాజాగా దీనిపై రజనీకాంత్ మనసు మార్చుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నట్టు సమాచారం. సీఎం అభ్యర్థిగా రజనీనే ఉండాలని, అలా అని రజనీతోనే చెప్పించేలా ఆయన మనసు మార్చేందుకు అభిమానులు, కార్యకర్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
తాను స్థాపించబోయే పార్టీ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రి అవుతాననే విషయాన్ని రజనీకాంత్.. ముందుగానే ప్రకటించాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారని సమాచారం. ఇదే విషయాన్ని వారంతా రజనీకాంత్ సన్నిహితుల దృష్టికి కూడా తీసుకెళ్లారని తెలుస్తోంది.