సూపర్ స్టార్ రజినీకాంత ఈరోజు (డిసెంబర్ 12) 70 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భాంగా ఆయనకు సినీ ప్రముఖులు , అభిమానులు , రాజకీయ నేతలు ఇలా అనేక రంగాలవారు బెస్ట్ విషెష్ ను అందజేస్తున్నారు. రజనీకాంత్ 1950 డిసెంబర్ 12న మహారాష్ట్రలో జన్మించారు. ఆయన అసలు పేరు శివాజీ రావ్ గైక్వాడ్. మహారాష్ట్రలో పుట్టి పెరిగిన ఆయన.. ఆ తర్వాత ఉద్యోగరీత్యా కర్ణాటకకు మకాం మార్చారు. 1973లో బెంగళూర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌లో కండక్టర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.
నటనపై ఉన్న ఆసక్తి, స్నేహితుల ప్రోత్సాహం కారణంగా సినిమా రంగం వైపు పయనమైయ్యారు.1973లో మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. 1975లో రజినీకి బాలచందర్ తొలి అవకాశం ఇచ్చారు. ఆ సినిమానే ‘అపూర్వ రాగంగళ్’ అయ్యింది. అక్కడి నుంచి చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ సోలో హీరోగా ఎదిగారు రజినీ. ఒక్క ఏడాదిలో 20కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు.
తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ రజినీ నటించారు. ‘టైగర్’ చిత్రంలో ఎన్టీఆర్‌కు తమ్ముడిగా నటించి ఆకట్టుకున్నారు. మోహన్‌బాబు ద్విపాత్రాభినయంలో వచ్చిన ‘పెదరాయుడు’ సినిమాలో రజినీకాంత్ పోషించిన పాపారాయుడు రోల్ తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది. రజినీకాంత్ నేరుగా చేసిన సినిమాల కంటే తమిళ డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావడం విశేషం.
‘దళపతి, బాషా, ముత్తు, అరుణాచలం, నరసింహ, చంద్రముఖి, శివాజీ, రోబో’ 2.0 లాంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రజినీకాంత్ తన 45ఏళ్ల కెరీర్లో 166 చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఈయన రాజకీయ ప్రవేశం చేయబోతున్నాడు. డిసెంబర్ 31 న తన పార్టీ ప్రకటన చేయబోతున్నారు.