ఆర్ నారాయణ మూర్తి. సామాజిక అంశాలపై సినిమాలు తెరకెక్కించే దర్శకుడు, నటుడు, నిర్మాత. సమాజంలో నెలకొన్న సమస్యలపై తనదైన రీతిలో చిత్రాన్ని తెరకెక్కించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. సినిమాను ఓ కళగా భావించి.. దాని నుంచి ప్రజలకు ఏదైనా చేయాలని తపించే వ్యక్తి ఆర్. నారాయణ మూర్తి. చిత్రాన్ని కేవలం వ్యాపారంగా భావించే ఈ రోజుల్లోనూ ఆయన మాత్రం తన పంథాను ఏమాత్రం మార్చుకోలేదు. సామాజిక సమస్యలపై తన కళతో బాణాలు ఎక్కుపెడుతూనే వస్తున్నారు. తాను తీసే సినిమాలకు ఆయనే దర్శకత్వం వహిస్తారు. ఆయనే ప్రొడ్యుసర్. కథ కూడా ఆయనదే. నటుడు ఆర్ నారాయణ మూర్తే ఉంటారు.
ఇలా సినిమాకు సంబంధించి అన్ని రంగాల్లో ప్రతిభను కనబరుస్తారు. కమర్షియల్ సినిమాల్లో ఎన్ని ఆఫర్లు వచ్చినా ఆ ఆఫర్లను నారాయణ మూర్తి సున్నితంగా తిరస్కరిస్తారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఆయన… కాలేజీలో విద్యార్థి సంఘానికి అధ్యక్షునిగా పని చేశారు. 18 ఏళ్ల వయస్సులో సినిమాల్లో నటుడు కావాలనే కోరికతో ప్రయత్నాలు మొదలుపెట్టారు.
మద్రాసులో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సీనియర్ ఎన్టీఆర్ ను అమితంగా ఇష్టపడే ఆర్. నారాయణమూర్తి.. ఆయనను చూసి తాను కూడా బీఏ చేయాలని భావించారు. హీరోగా నిలదొక్కుకునేందుకు మొదట దర్శకుడిగా తన సత్తా చూపించాలని అనుకున్నారు. స్నేహితులు సాయం చేయడంతో అర్ధరాత్రి స్వాతంత్రం అనే సినిమాను తెరకెక్కించారు. సమకాలీన సామాజిక అంశాలతో నారాయణ మూర్తి ఎక్కువగా సినిమాలను తెరకెక్కిస్తారు.
తన సామాజిక పంథాను చూసి పలు పార్టీలు రాజకీయాలకు ఆహ్వానించినా అటు వైపు వెళ్లలేదు నారాయణ మూర్తి. తనకున్న 12 ఎకరాల భూమిని కూడా దానం చేశారు. నారాయణమూర్తి పలు ఆలయాలు కట్టించారు. కానీ ఇవేవీ చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడరు. ఆర్. నారాయణ మూర్తి అంత పెద్ద సెలబ్రిటీ అయినప్పటికీ ఆయన మాత్రం ఎప్పుడూ సాధారణ వ్యక్తిగానే ఉంటారు. ఆటోల్లో ప్రయాణిస్తారు. సిటీ బస్సుల్లో వెళ్తారు. తనకు ఎన్ని కమర్షియల్ సినిమా ఆఫర్లు వచ్చినా ఆయన ఏ ఒక్కదాన్ని కూడా ఒప్పుకోలేదు. తన ఎంచుకున్న దారిలోనే వెళ్తున్నారు. సామాజిక అంశాలపైనే చిత్రాలు తెరక్కిస్తున్నారు.