యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల జాబితా చాలా పెద్దగా ఉంది. లైన్ లో మొదట రాధే శ్యామ్ విడుదలకు సిద్దంగా ఉంది. అతి త్వరలోనే రాధే శ్యామ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రభాస్ మరో వైపు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. బొగ్గు గనిలో ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసిన మేకర్స్ త్వరలో సినిమాను తదుపరి షెడ్యూల్ కు తీసుకు వెళ్లబోతున్నారు.
ప్రభాస్ తో కేజీఎఫ్ ను మించిన యాక్షన్ డ్రామాను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కాని కరోనా కారణంగా ఆలస్యం అయ్యేలా ఉంది. ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్రభాస్ పాత్ర ఏమై ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో చిత్ర యూనిట్ సభ్యుల నుండి అనధికారికంగా క్లారిటీ వచ్చింది. ఆర్మీ ఆఫీసర్ గా ప్రభాస్ కనిపించబోతున్నాడట.
సలార్ లో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రల్లో లేదా రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నాడు. అందులో ఒకటి ఆర్మీ ఆఫీసర్ అంటున్నారు. ఈ సినిమా లో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు సోదరి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమా షూటింగ్ ను ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేయాలనే పట్టుదలతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఉన్నాడు.