ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌గా రాధా కృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ మరియు ప్రమోద్ లు నిర్మిస్తున్న రాధేశ్యామ్ సినిమా షూటింగ్ కరోనా వల్ల ఆగిపోయింది. యూరప్‌లో ఉన్న చిత్ర యూనిట్ సభ్యులు రాధేశ్యామ్ సినిమా షూటింగ్‌ను అర్థాంతరంగా నిలిపేసి ఇండియాకు తిరిగి వచ్చారు. వారు వచ్చిన కొన్ని రోజులకే లాక్ డౌన్ విధించారు. యూరప్ లో చిత్రీకరణ బ్యాలన్స్ ఉంది. దానితో పాటు ఇండియాలో కూడా కొన్ని చోట్ల చిత్రీకరణ ప్లాన్ చేశారు. అయితే కరోనా కారణంగా సినిమాను బయట ఎక్కడ కూడా షూట్ చేసే అవకాశం లేదు.
గత నాలుగు అయిదు నెలలుగా రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఆసుపత్రి సెట్టింగ్ ను ఏర్పాటు చేయిస్తున్నారు. అందుకు సంబంధించిన పనులు దాదాపుగా ముగింపు దశకు వచ్చాయి. కేవలం రెండు వారాల పాటు ఆ సెట్ లో చిత్రీకణ జరుపబోతున్నారు. వచ్చే నెలలో రాధేశ్యామ్ షూటింగ్ పునః ప్రారంభం కాబోతుంది.
భారీ అంచనాలున్న ఈ సినిమాను రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆసుపత్రి సెట్ లోనే కాకుండా ఆ తర్వాత యూరప్ లో కూడా రెండు లేదా మూడు వారాల పాటు చిత్రీకరణ చేయబోతున్నారట. అందుకు కూడా వీసాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తానికి ఈ ఏడాదిలో సినిమాను పూర్తి చేయాలనే పట్టుదలతో మేకర్స్ ఉన్నారు. ఎందుకంటే వచ్చే ఏడాది ఆరంభంలోనే ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాను ప్రభాస్ చేయాల్సి ఉంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
మొత్తానికి రాధేశ్యామ్ సినిమాను నవంబర్ లేదా డిసెంబర్ వరకు పూర్తి చేయబోతున్నారు. ఆ తర్వాత సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు నిర్వహించి సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్ తో పాటు సౌత్ లో అన్ని భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. బాహుబలి మరియు సాహో సినిమాల తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా ఇదే అవ్వడంతో రచ్చ రచ్చగా అభిమానులు అంచనాలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు.