విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భాంగా ఆయనకు అభిమానులు , సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున పుట్టినరోజు విషెష్ అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ , వెంకటేష్ తో తనకున్న అనుబంధాన్ని ప్రెస్ నోట్ ద్వారా తెలియజేసి ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలు తెలిపి ఆకట్టుకున్నారు.
పవన్ ఏమన్నాడంటే..‘‘శ్రీ వెంకటేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మంచి మనసున్న సన్మిత్రులు, ప్రముఖ కథానాయకులు శ్రీ వెంకటేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీ వెంకటేష్ గారితో నాకున్న స్నేహం ఎంతో ప్రత్యేకమైనది. నేను కథానాయకుణ్ణి కాక ముందు నుంచి ఆయనతో నాకు మితృత్వం ఉంది. తరచూ శ్రీ వెంకటేష్ గారితో మాట్లాడుతూ ఉండేవాణ్ణి. ఆయన మంచి చదువరి.
ముఖ్యంగా ఆధ్యాత్మిక, ధార్మిక, లౌకిక సంబంధమైన పుస్తకాలు ఎక్కువగా చదివేవారు. అందులో ఉన్న విషయాలు వివరించేవారు. ఆ సంభాషణలు, చర్చలే మా స్నేహాన్ని ధృడపరచాయి. ఇప్పటికీ మా ఇద్దరి మధ్య సినిమా విషయాలతోపాటు హైందవ ధర్మం, భక్తికి సంబంధించిన విషయాలు చర్చకు వస్తుంటాయి. ఆ స్నేహమే మేమిద్దరం ‘గోపాల గోపాల’ చిత్రంలో నటించేలా చేసింది. మా ఆలోచనలకు ఆ చిత్రం అద్దంపట్టింది. కొత్త తరం దర్శకుల కథలకు.. ఆలోచనలకు అనుగుణంగా తనను తాను మలచుకొనే శ్రీ వెంకటేష్ గారు మరిన్ని విజయాలతో ప్రేక్షకులను మెప్పిస్తారని ఆకాంక్షిస్తున్నాను’’ అని నోట్లో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.