నాని 25వ సినిమా ‘వి’ విడుదలకు రెడీ అయ్యింది. సుధీర్ బాబు ఈ సినిమాలో హీరోగా నటించగా నాని నెగటివ్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. దిల్ రాజు బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా విడుదల చేయాలనుకున్న సమయంలో కరోనా ఎటాక్ అయ్యింది. దాంతో సినిమాను ఓటీటీ విడుదల చేస్తారని అనుకున్నారు. కాని దిల్ రాజు మొన్నటి వరకు కూడా ఓటీటీ విడుదలకు ఆస్తకి చూపించలేదు.
చివరకు ఆర్థిక పరమైన కారణాలతో సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. దర్శకుడు ఇంద్రగంటికి ఈ విడుదల ఇష్టం లేదు అనేది కొందరి వాదన. తెలుగు నుండి ఓటీటీలో విడుదల కాబోతున్న మొదటి పెద్ద సినిమా ఇదే అవ్వడంతో అందరిలో కూడా ఆసక్తి నెలకొంది. ఈ సమయంలోనే ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి ఎంత దిల్‌రాజుకు ఎంత వచ్చింది అనే విషయంపై చర్చ జరుగుతోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దిల్ రాజు ‘వి’ సినిమాకు రూ.25 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగిందట. థియేట్రికల్ రైట్స్ ద్వారా 30 కోట్లు వచ్చాయి. అయితే విడుదల కాలేదు కనుక ఆ డబ్బు వెనక్కు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు అమెజాన్ వారు కూడా ఈ సినిమాను దాదాపుగా 30 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇది కాకుండా శాటిలైట్ రైట్స్ ద్వారా మరో ఏడు నుండి ఎనిమిది కోట్లు దిల్‌రాజు ఖాతాలో పడబోతున్నాయి.
ఒక వేళ థియేటర్లు విడుదల అయిన తర్వాత మల్టీ ప్లెక్స్‌ల్లో కాకుండా జిల్లాల్లో విడుదలకు అమెజాన్ తో ఒప్పందం ఉంది. కనుక అవి అయిదు కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. ఇలా మొత్తంగా 40 కోట్లకు పైగానే దిల్ రాజు ‘వి’ సినిమాతో తన ఖాతాలో వేసుకున్నటు్లగా చెబుతున్నారు. దిల్ రాజు ఏం చేసినా పక్కా బిజినెస్ తో చేస్తాడనే విషయం ఈ సినిమా బిజినెస్ తో మరోసారి నిరూపితం అయ్యిందని సినీ జనాలు మరియు ఆయన సన్నిహితులు అంటున్నారు.