టాలీవుడ్ కింగ్ మరోసారి తన తోటి హీరోలకు ఆదర్శంగా నిలిచాడు. శివ సినిమాతో విభిన్నమైన సినిమాలను ఎంపిక చేసుకోవడంలో ఆదర్శంగా నిలిచిన నాగ్ ఆ తర్వాత దేవుడి సినిమాలు చేయడంలో కూడా టాలీవుడ్ కు ఆదర్శంగా నిలిచాడు. ఇప్పుడు కరోనా పరిస్థతుల్లో నాగార్జున షూటింగ్ చేసేందుకు ముందుకు వచ్చి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆరు నెలల తర్వాత షూటింగ్ కు నాగార్జున వచ్చాడు.
ఇంకా చాలా మంది హీరోలు కరోనా భయంతో షూటింగ్ కు హాజరు అయ్యేందుకు భయపడుతున్నారు. వారందరికి ధైర్యం ఇచ్చేలా నాగ్ తన ‘వైల్డ్‌డాగ్’ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. సాల్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన బ్యాలన్స్ షూటింగ్‌ను పూర్తి చేసేందుకు నాగార్జున నిన్నటి నుండి షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇదే సమయంలో నాగార్జున బిగ్‌బాస్ సీజన్ 4 తో కూడా రెడీ అవుతున్నాడు.
మొదటి నుండి కూడా నాగార్జున కరోనా విషయంలో కాస్త టెన్షన్ గా ఉన్నా కూడా ఇతర హీరోల అంత కాకుండా కాస్త ధైర్యంగానే ముందుకు వచ్చారు. ఆందోళన లేకుండా షూటింగ్‌లో పాల్గొంటున్న నాగార్జునను చూసి అయినా ఇతర హీరోలు కెమెరా ముందుకు రావాలంటూ సినీ కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు. గత ఆరు నెలలుగా షూటింగ్స్ లేక పోవడంతో నానా ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికుల కోసం అయినా స్టార్ హీరోలు బరిలోకి దిగాలి.
షూటింగ్స్ జరిగితే తప్ప కడుపు నిండా తిండి దొరకని ఎంతో మంది ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్నారు. కనుక నాగార్జునను అనుసరించి మళ్లీ షూటింగ్స్ కు స్టార్ హీరోలు హాజరు అయితే బాగుంటుందని అంటున్నారు. సీనియర్ హీరోలు ఈ నెల లేదా వచ్చే నెల నుండి షూటింగ్ లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. వచ్చే నెలలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా షూటింగ్ కూడా పునః ప్రారంభం కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఆచార్య సంగతి తెలియాల్సి ఉంది.