సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు తో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా వచ్చి పది నెలలు అవుతుంది. కరోనా కారణంగా ఇప్పటి వరకు మహేష్ కొత్త సినిమా షూటింగ్ కు వెళ్లలేదు. సర్కారు వారి పాటను ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన మహేష్‌బాబు ఆ సినిమా షూటింగ్ ను వచ్చే నెల నుండి ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. మొదటి షెడ్యూల్ ను అమెరికాలో నిర్వహించేందుకు దర్శకుడు పరశురామ్ భారీ ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగాయి.
రెండు మూడు వారాల క్రితం దర్శకుడు పరశురామ్ అమెరికా వెళ్లి మరీ షూటింగ్ కు సంబంధించిన లొకేషన్స్ ను వెదికి వచ్చాడట. అక్కడ దాదాపుగా 40 రోజుల పాటు చిత్రీకరణ జరిపేందుకు గాను ఏర్పాట్లు చేశారు. మొదటి షెడ్యూల్‌ను అక్కడే నిర్వహించబోతున్న చిత్ర యూనిట్ సభ్యులు జనవరి వరకు అక్కడే ఉండి ఫిబ్రవరిలో మళ్లీ ఇండియాలో చిత్రీకరణ జరుపబోతున్నారు. మొత్తానికి సినిమాను సమ్మర్లోనే పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమాలో ఇప్పటికే కీర్తి సురేష్ నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకా యూనిట్ సభ్యులు మాత్రం హీరోయిన్ ను ఫైనల్ చేయలేదని అంటున్నారు. అమెరికా షెడ్యూల్ లో హీరోయిన్ ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ హీరోయిన్ కూడా అమెరికా షెడ్యూల్ లో నటించాల్సి ఉంటే త్వరలోనే ఆమె ఎంపిక జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఆలస్యంగా ఆమె ఎంట్రీ ఉంటే వచ్చే ఏడాదిలోనే సర్కారు వారి పాట హీరోయిన్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. నవంబర్ రెండవ లేదా మూడవ వారంలో అమెరికాకు వెళ్లి అక్కడ షూటింగ్ ను మొదలు పెట్టేందుకు ఇప్పటి నుండే మహేష్ అండ్ టీం రెడీ అవుతున్నారు.