పాతికేళ్లు అయినా కూడా మణిరత్నం ‘బొంబై’ సినిమాలోని రహమాన్ స్వరపర్చిన కన్నానులే.. అనే పాట ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. పదుల సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఆ పాట ఇంకా జనాల నోళ్లలో నానుతూనే ఉంది అంటే ఆ పాట గొప్పతనంను చెప్పనక్కర్లేదు. అంతటి సూపర్ హిట్ సాంగ్ ను అందాల రాక్షసి ఫేం లావణ్య త్రిపాఠి రీ క్రియేట్ చేసింది.
అందమైన ఆ పాటను మరింత అందమైన లావణ్య త్రిపాఠి కవర్ వీడియో చేయడంతో అది వైరల్ అయ్యింది.తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న లావణ్య త్రిపాఠి అందరు హీరోయిన్స్ మాదిరిగా తాను కూడా యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించింది. ఆ యూట్యూబ్ ఛానెల్లో మొదటగా ఈ పాటను షేర్ చేసింది. స్నేహితురాలు ఉమాంగ్ గుప్తాతో కలిసి లావణ్య ఈ పాటను చేసింది.
ఇద్దరు సేమ్ డ్రస్‌లు వేసుకుని ఒక అందమైన కేరళ రబ్బరు తోటలో ఈ వీడియోను చిత్రీకరించారు. పచ్చటి బ్యాక్ గ్రౌండ్ తెల్లటి డ్రస్‌లో లావణ్య మెరిసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. లావణ్య త్రిపాఠి ఈ కవర్ సాంగ్ తో ఒక్కసారిగా వైరల్ అయ్యింది.
ప్రస్తుతం ఈమె సందీప్ కిషన్ తో హాకీ నేపథ్యంలో సాగుతున్న ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ సినిమాలో నటిస్తోంది. అందులో హాకీ క్రీడాకారిణిగా కనిపించబోతుంది. మరో వైపు తమిళంలో ఒక సినిమాను చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వెబ్ సిరీస్‌ల విషయంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. హీరోయిన్గా ఇప్పుడిప్పుడే పెద్ద ప్రాజెక్ట్ లు చేస్తున్న లావణ్య త్రిపాఠి ఈ పాటతో దర్శకుల దృష్టిని ఆకర్షించి మరిన్ని మంచి ఆఫర్లను దక్కించుకుంటుందేమో చూడాలి.