తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో పార్టీ ప్రకటన చేయబోతున్నారని అంత ఆసక్తి గా ఎదురుచూస్తున్న క్రమంలో పార్టీ ప్రారంభిచలేనంటూ మూడు పేజీల సుదీర్ఘ లేఖను ట్విట్టర్ వేదికగా విడుదల చేసి షాక్ ఇచ్చారు. అనారోగ్య కారణాల కారణంగా రాజకీయాల్లోకి రావడం లేదని .. తానిచ్చిన మాటను వెనక్కి తీసుకోవడంపై తనను క్షమించాలంటూ అభిమానులను కోరారు. రాజకీయ ప్రకటనకు ముందు ఆసుపత్రిలో తాను చేరడమనేది దేవుడి హెచ్చరికగా భావిస్తున్నట్టు లేఖలో తెలిపారు. తప్పకుండా రాజకీయాల్లోకి వస్తా.. కానీ ఇప్పుడు కాదు అని తేల్చిచెప్పారు.
ఈ ప్రకటన తో అభిమానులు , తమిళ ప్రజలు ఎంతో భాదపడుతున్నారు. ఇదే విషయాన్నీ కుష్బూ ట్విట్టర్ ద్వారా ఎమోషనల్ అవుతూ తెలిపింది. ”డియర్ రజనీ సర్.. మీరు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతోమంది తమిళుల హృదయాలను గాయపరిచింది. కానీ మీ సమస్యను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఎందుకంటే మన ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు. మీ స్నేహితురాలిగా, శ్రేయోభిలాషిగా మీరు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నాను. నాకు మీరు అత్యంత విలువైన, ఎంతో ముఖ్యమైనవారు. జాగ్రత్తగా, సంతోషంగా ఉండండి” అని కుష్బూ తన ట్వీట్లో రాసుకొచ్చారు.