మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదల అయ్యింది. సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయిన వెంటనే సినిమాకు సంబంధించిన కథ నాది అంటే నాది అంటూ ఇద్దరు రచయితలు మీడియా ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా రాజేష్ అనే రచయిత ఈ కథ నాది నా జీవితం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
కథ తనది అనేందుకు చాలా ఆధారాలు ఉన్నాయని ఆయన అంటున్నాడు. చిరంజీవి మరియు కొరటాలను కలిసేందుకు ఆయన ప్రయత్నించాడట. కాని అందుకు వీలు పడలేదని మీడియా ముందుకు వచ్చాడు. బి గోపాల్ శిష్యుడు అయిన రాజేష్ ఈ కథను బాలకృష్ణ కోసం రెడీ చేసుకున్నాడట. మైత్రి వారికి రెండు సంవత్సరాల క్రితం ఈ కథను చెప్పాను. వారు నా కథను దొంగిలించి కొరటాలకు ఇచ్చారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
మరో వైపు చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం కథ విషయంలో ఆయన చేస్తున్న ఆరోపణలు కొట్టి పారేస్తున్నారు. అతడు డబ్బు కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంలో దర్శకుడు కొరటాల శివ స్పందించాడు.
కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి కథ నాది అంటూ వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉంది. నా పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు కథ విషయంలో నానా రచ్చ చేసి సినిమా రెప్యుటేషన్ తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టులో ఈ విషయాన్ని తేల్చుకోవాలనుకుంటున్నాను.
నా పై తప్పుడు ఆరోపణలు చేయడంతో పాటు నాపై నింద మోపడం వల్ల జరిగే నష్టం ఏమీ లేదు. కాని ముందు ముందు ఇలాంటి వారు పబ్లిసిటీ కోసం రాకుండా ఉండాలంటే కోర్టుకు వెళ్లాల్సిందే అనుకుంటున్నట్లగా కొరటాల పేర్కొన్నాడు. మరి ఈ విషయంలో ఆయన ముందు ముందు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాడో చూడాలి.