బాలీవుడ్ లో ఈమద్య టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన కంగనా రనౌత్ వ్యాఖ్యలు శృతి మించుతున్నాయి. సుశాంత్ మృతికి బాలీవుడ్ లో ఉన్న నెపొటిజం కారణం అంటూ మొదటి నుండి విమర్శలు చేస్తున్న కంగనా రనౌత్ ఆ తర్వాత బాలీవుడ్‌లో ఉన్న దాదాపు 90 శాతం మందికి డ్రగ్స్ అలవాటు ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో ఆమె ముంబాయిని పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పోల్చడంతో వివాదం మరింత ముదిరింది.
మనాలిలో ఉన్న కంగనాను ముంబయిలో అడుగు పెట్టనిచ్చేది లేదు అంటూ శివ సేన కార్యకర్తలు హెచ్చరించారు. వారి హెచ్చరికలకు అంతే స్థాయిలో కంగనా రిప్లై ఇచ్చింది. ఎవడు వస్తాడు, వాడి బాబు వచ్చినా కూడా నన్ను ముంబయిలో దిగకుండా ఆపలేరు. నేను ఈనెల 9వ తారీకున ముంబయిలో అడుగు పెట్టబోతున్నాను. ఎవరు ఏం చేసుకుంటారో చూడండి. దిగిన టైం ను కూడా నేను చెప్తానంటూ శివ సేన కార్యకర్తలను మరింతగా రెచ్చగొట్టింది.
ఈ విషయంలో ఆమె చేస్తున్న వ్యాఖ్యలతో బాలీవుడ్ వర్గాల వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంబయిని ముంబయి పోలీసు వ్యవస్థను కించపర్చే విధంగా మాట్లాడిన ఆమెను బాలీవుడ్ నుండి బాయ్ కాట్ చేయాలంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు. శివసేన ఎంపీ మాట్లాడుతూ తినే పళ్లెంలో ఉమ్మేసే రకం ఆమె. అలాంటి వారికి ఇక్కడ స్థానం లేదు అంటూ వ్యాఖ్యలు చేశాడు.
ముంబయిలో ఆమె ఇన్నాళ్లు ఉన్న విషయాన్ని మర్చి పోయి పీఓకేతో పోల్చింది అంటే ఆమె తీరును అర్థం చేసుకోవచ్చు అంటూ శివసేన పార్టీ నాయకులు ఆగ్రహంతో ఊగి పోతున్నారు. అత్యంత నీచమైన ఆమె పద్దతిని ప్రతి ఒక్కరు కూడా ఎండగట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ సమయంలోనే ఐ లవ్ ముంబై అనే క్యాంపెయిన్ ను ప్రారంభించి కంగనా వ్యాఖ్యలను తిప్పి కొట్టాలంటూ సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు.