ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా తో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి హీరోగా షార్ట్ ఫిల్మ్ చిత్రాల దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన జాతిరత్నాలు సినిమా పై అంచనాలు మొదటి నుండి భారీగా పెంచేశారు. విడుదలకు ముందు వారు చేసిన సందడితో సినిమాపై అంచనాలు పీక్స్ కు చేరాయి. మరి సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథః
వరంగల్ జిల్లా జోగిపేట కు చెందిన శ్రీకాంత్(నవీన్ పొలిశెట్టి) తన స్నేహితులు(రాహుల్ రామకృష్ణ మరియు ప్రియదర్శి) తో కలిసి లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తాము చేసేది కరెక్ట్ అనుకుంటూ జాలీగా తిరిగుతూ ఉండే ఈ ముగ్గురు హైదరాబాద్ వెళ్లి బంజారాహిల్స్ జూబ్లీ హిల్స్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. అలాంటి వారిపై అనుకోకుండా ఒక హత్య కేసు పడుతుంది. ఆ కేసు నుండి వారు ఎలా బయట పడ్డారు.. వారికి హీరోయిన్ ఎలా సాయం చేసింది అనేది కథ.
విశ్లేషణః
కథ చాలా సింపుల్ గా ఉందా లేదా అన్నట్లుగా ఉంది. కాని స్క్రీన్ ప్లే మాత్రం చాలా ఎంటర్ టైన్ మెంట్ తో సాగింది. ఫస్ట్ నుండి చివరి వరకు ఎక్కడ ఎంటర్ టైన్ మెంట్ మిస్ కాలేదు. సినిమా ప్రమోషన్ సందర్బంగా ఇచ్చిన హామీ ప్రకారం ఒక టీమ్ గా వెళ్లి సినిమా ను ఎంజాయ్ చేయవచ్చు. హీరో నవీన్ పొలిశెట్టి తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. కమెడియన్ గా మంచి పేరున్న రాహుల్ రామకృష్ణ మరియు ప్రియదర్శిలను మించి నవీన్ పొలిశెట్టి కామెడీ ని పండించి ఆకట్టుకున్నాడు. వారిద్దరిని కూడా నవీన్ తొక్కేశాడు అనడంలో సందేహం లేదు.
హీరోయిన్ ఫరియా అద్బుల్లా కూడా కామెడీతో ఆకట్టుకుంది. లాయర్ పాత్రకు ఆమె పూర్తిగా న్యాయం చేసింది. ప్రతిభ ఉన్న నటిగా ఫరియా కు మంచి మార్కులే పడతాయి. ఇక ఈ సినిమాలో నటించిన ఇతర నటీనటులు పర్వాలేదు అనిపించారు. సంగీతం విషయానికి వస్తే చిట్టి నీ నవ్వంటే పాట ఇప్పటికే సక్సెస్ అయ్యింది. ఇతర పాటలు సో సో గానే అనిపించాయి. సినిమాటోగ్రాఫీ గొప్పగా ఏమీ లేదు. ఇక దర్శకత్వం విషయానికి వస్తే సింపుల్ కథను మంచి ఎంటర్ టైన్ మెంట్ తో చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఎక్కడ లాగ్స్ లేకుండా ఎక్కడ కూడా బోర్ కలుగకుండా కథనం సాగింది. సినిమా మొత్తం కూడా ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో కొనసాగింది. సినిమా ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, సెకండ్ హాఫ్ కు వచ్చేప్పటికి కాస్త తగ్గినట్లుగా అనిపించినా ఓవరాల్ గా చూస్తే ఈ సినిమా మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా చెప్పుకోవచ్చు.
ప్లస్ పాయింట్స్‌ః
నవీన్ పొలిశెట్టి,
కామెడీ,
ఫస్ట్ హాఫ్,
హీరోయిన్
మైనస్ పాయింట్స్ః
కథ స్ట్రాంగ్ గా లేకపోవడం,
కొన్ని లాజిక్ లేని సీన్స్
చివరగా..
ఎంటర్ టైన్ విషయంలో జాతిరత్నాలు సూపర్.
రేటింగ్ : 3.0/5.0