బాలీవుడ్ హీరోలు స్టార్ క్రికెటర్ లు మరియు ఇతర ప్రముఖ ఆటగాళ్లు మాత్రమే పేరు పొందిన బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరించే వారు. కానీ గత నాలుగైదు సంవత్సరాలుగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పదుల సంఖ్యలో బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆయన దారిలోనే టాలీవుడ్ కు చెందిన ఇతర హీరోలు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు రెడీ అవుతున్నారు.
ఇటీవలే ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఒక బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్లుగా పేర్కొంటూ అందుకు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేయడం జరిగింది. గార్నియర్ కు రామ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు. అందుకు భారీగా ఆయన పారితోషకం దక్కించుకొని ఉంటాడు అంటూ టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరిగింది. రామ్ తర్వాత మరో యంగ్ హీరో అయిన నితిన్ కూడా ఒక కమర్షియల్ యాడ్ లో నటించేందుకు సిద్దమయ్యాడు.
ప్రస్తుతం ఆ యాడ్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఒక వైపు రంగ్ దే సినిమా షూటింగుల్లో పాల్గొంటూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తున్నట్లుగా నితిన్ పేర్కొన్నాడు. షూటింగ్ కి సంబంధించిన ఫోటోలను ఆయన ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. మొదటి సారి కమర్షియల్ యాడ్ లో నటిస్తున్నట్లుగా ఆ ఫొటోలకి కామెంట్ పెట్టాడు. ఇక నితిన్ సినిమాల విషయానికి వస్తే రంగ్ దే త్వరలోనే పూర్తి కాబోతుంది. ఆ తర్వాత హిందీ సినిమా అంధాదున్ ను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు.
ఈ రెండు సినిమాలు కాక పవర్ పేట కూడా నితిన్ చేసేందుకు రెడీ అయ్యాడు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక సినిమాలో ఇప్పటికే నితిన్ ప్రకటించాడు. మొత్తానికి 5 సినిమాలు చేతిలో పెట్టుకొని కూడా నితిన్ కమర్షియల్ యాడ్ లో నటించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ యాడ్ కు గాను నితిన్ కోటి రూపాయల పారితోషికం అందుకున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఏడాది పాటు ఆ సంస్థ కోసం నితిన్ యాడ్ లో నటించాల్సి ఉంటుంది.