ఈమద్య కాలంలో తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన థియేటర్ల విషయం వార్తల్లో తెగ వినిపస్తున్నాయి. థియేటర్ల టికెట్ల రేట్ల గురించి ప్రముఖంగా చర్చ జరుగుతున్నాయి. ఏపీ లో టికెట్ల రేట్లను తగ్గించడం వల్ల చాలా థియేటర్లను మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణలో కూడా లాక్ డౌన్ తర్వాత చాలా థియేటర్లను మూసి వేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు పూర్వ వైభవంను తెచ్చుకుంటున్నాయి అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా మళ్లీ టికెట్ల రేట్ల ఇష్యూ తెరపైకి వచ్చి వివాదం మొదలు అయ్యింది. ఈసమయంలో కూకట్ పల్లి లోని భ్రమరాంభ థియేటర్ లో అగ్ని ప్రమాధం జరిగింది.
తెల్లవారు జామున అగ్ని ప్రమాదం జరిగి పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగింది. థియేటర్ లోని దాదాపు రెండు కోట్ల కు పైగా ఫర్నీచర్ మరియు ఇతర సాంకేతిక పరిజ్ఞానం కాలి బూడిద అయినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంకు కారణం షార్ట్ సర్క్యూట్ గా చెబుతున్నారు. మానవ తప్పిదం ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఈ విషయం ప్రస్తుతం పెద్ద ఎత్తున ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పెద్ద హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే ఖచ్చితంగా కూకట్‌పల్లి లోని భ్రమరాంభ థియేటర్ వద్ద హడావుడి కనిపిస్తుంది. అలాంటి హడావుడి రెగ్యులర్ గా ఉండే థియేటర్ వద్ద ఇలాంటి ప్రమాదం జరగడం దారుణం.
అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నా కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. థియేటర్ లోని మొత్తం సామాగ్రి అగ్నికి ఆహుతి అయ్యింది. మొత్తంగా రెండు కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదం గురించి కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. మరో వైపు థియేటర్ యాజమాన్యం నుండి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులకు ఈ థియేటర్ తో సంబంధాలు ఉంటాయి. వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.