వెంకటేష్, వరుణ్‌తేజ్, తమన్నా , మెహ్రీన్ , రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ఎఫ్ 2. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. 2019 సంక్రాంతి బరిలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి విన్నర్ గా నిలిచి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎఫ్ 3 పేరుతో రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఎఫ్ 2లో నటించిన వెంకీ, వరుణ్, తమన్నా, మెహ్రీన్.. ఈ సీక్వెల్లోనూ నటించనున్నారు. ఈ సినిమా డిసెంబర్ 14న లాంఛనంగా ప్రారంభం కాబోతోందని ఇండస్ట్రీలో వర్గాలు అంటున్నాయి.
‘ఎఫ్ 2 ’కి మించిన వినోదం ‘ ఎఫ్ 3’లో ఉంటుందని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, ఈ సినిమా బడ్జెట్‌కు సంబంధించి ఇండస్ట్రీలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
‘ఎఫ్ 2’ సినిమాను నిర్మాత దిల్ రాజు సుమారు రూ.35 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రం ఏకంగా రూ.81 కోట్ల థియేట్రికల్ షేర్‌ను వసూలు చేసింది. దిల్ రాజు కెరీర్లో అత్యధిక లాభం చేకూర్చిన సినిమా ఇది. అందుకే, అనిల్ రావిపూడి మీద నమ్మకంతో ‘ఎఫ్ 3’ సినిమాకు బడ్జెట్‌ను డబుల్ చేశారట దిల్ రాజు. ఏకంగా రూ.70 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారట. అయితే, బడ్జెట్ డబుల్ కావడానికి కారణాలు కూడా ఉన్నాయంటున్నారు.
‘ఎఫ్ 2’ సినిమా సమయంలో వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి.. ముగ్గురూ రెమ్యునరేషన్ తక్కువగానే తీసుకున్నారట. అయితే, అనిల్ రావిపూడి ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉండటంతో రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగిందని అంటున్నారు. ఇక ‘ఎఫ్ 2’, ‘వెంకీ మామ’ హిట్ల తో జోరందుకున్న వెంకటేష్ కూడా తన పారితోషికాన్ని స్వల్పంగా పెంచారట. వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ పెంచినట్టు ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. వీళ్లతో పాటు ‘ఎఫ్ 3’లో ఇంకొంత మంది స్టార్లు కనిపించనున్నారట. అందుకే, బడ్జెట్ అమాంతం పెరిగిపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.