గతంలో బాలనటుడిగా, ఆ తర్వాత హీరోగా తానేంటో నిరూపించుకున్న విశ్వ కార్తికేయ తాజాగా నటించిన చిత్రం ” అల్లంత దూరాన”. ఇందులో ఆయనకు జోడీగా ప్రముఖ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాసన్ నాయిక గా నటించింది. చలపతి పువ్వల దర్శకత్వం వహించారు. ఆర్.ఆర్. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై శ్రీమతి కోమలి సమర్పణలో నిర్మాత ఎన్. చంద్రమోహనరెడ్డి తెలుగు, తమిళ భాషలలో నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు బాబి (కె.ఎస్. రవీంద్ర) విడుదల చేశారు. అనంతరం బాబి మాట్లాడుతూ, “మోషన్ పోస్టర్ చాలా బావుంది. మంచి విజువల్స్, మెలోడీ మ్యూజిక్ సమ్మేళనంతో ప్రేక్షకులను అలరించే సినిమాగా అనిపిస్తోంది. దర్శక, నిర్మాతలతో పాటు చిత్రబృందానికంతటికీ శుభాభినందనలు తెలియజేస్తున్నా” అని అన్నారు. ఇక ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను చూసిన ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చాలా బావుందంటూ ప్రశంసిస్తూ… చితబృందానికి శుభాశీస్సులు అందజేశారు.
చిత్ర దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ, “ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చిత్రమిది. నాకు స్ఫూర్తిని కలిగించిన దర్శకులలో బాబి గారు ఒకరు. ఆయన చేతుల మీదుగా మోషన్ పోస్టర్ విడుదల కావడం ఆనందంగా ఉంది. మా మోషన్ పోస్టర్ ను చూసి అభినందించిన భరద్వాజ గారికి కృతజ్ఞతలు” అని అన్నారు.
నిర్మాత ఎన్. చంద్రమోహనరెడ్డి మాట్లాడుతూ, “నేను మెగాస్టార్ అభిమానిని. పలు చక్కటి చిత్రాలకు దర్శకత్వం వహించిన బాబి గారు మా మెగాస్టార్ చిత్రానికి దర్శకత్వం వహించనుండటం ఆనందదాయకం. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నాం. హైదరాబాద్ తో పాటు కార్వేటినగరం, పుత్తూరు, తిరుపతి, ఆర్.కె.వి.పేట, కేరళ, చెన్నై, పాండిచ్చేరి తదితర లొకేషన్లలో షూటింగ్ చేశాం. తెలుగుతో పాటు కొందరు ప్రముఖ తమిళ నటీనటులు కూడా ఇందులో నటించారు” అని అన్నారు.
హీరో విశ్వ కార్తికేయ మాట్లాడుతూ , “జమ్మూకాశ్మీర్ షూటింగ్ లో ఉన్న కారణంగా నేను మోషన్ పోస్టర్ విడుదలకు హాజరు కాలేకపోయాను అంటూ ఓ వీడియో విజువల్ ను షేర్ చేశారు. లోగడ ఇదే దర్శకుడితో “కళాపోషకులు” చిత్రాన్ని చేశాను. మంచి విజన్ ఉన్న దర్శకుడు, అభిరుచి కలిగిన నిర్మాతతో మెలో డ్రామా చిత్రాన్ని చేయడం సంతోషంగా ఉంది. రధన్ సంగీతం, కళ్యాణ్ ఛాయాగ్రహణం చిత్రాన్ని మరో స్థాయిలో నిలబెడతాయి” అని అన్నారు.
ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో భాగ్యరాజా, అలీ, ఆమని, తమిళ్ జేపీ, తులసి, జార్డమేరియన్, అప్పాజీ, అనంత్ , ఇళవరసన్, డానియెల్, స్వామినాథన్, కృష్ణవేణి, నారాయణరావు, శివ తదితరులు తారాగణం.
ఈ చిత్రానికి పాటలు: రాంబాబు గోశాల, సంగీతం: రధన్ (జాతి రత్నాలు ), కెమెరా: కళ్యాణ్ బోర్లగాడ్డ, ఎడిటింగ్: శివకిరణ్, డాన్స్: గోపి, ఫైట్స్: నాభ, ఆర్ట్: చంద్రమౌలి, సమర్పణ: శ్రీమతి కోమలి, నిర్మాత: ఎన్.చంద్రమోహనరెడ్డి, రచన-దర్శకత్వం: చలపతి పువ్వల.