విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన డియర్ కామ్రేడ్ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళంలో కూడా విడుదల అయ్యింది. కాని ఏ ఒక్క భాషలో కూడా కమర్షియల్‌గా సక్సెస్ అవ్వలేదు. కాని హిందీలో ఈ సినిమా డబ్ అయ్యి అక్కడ మంచి సక్సెస్ దక్కించుకుంది.
అది ఎంతగా అంటే రికార్డులు బద్దలు అయ్యేంతగా.. ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీ కూడా సాధించని రికార్డును ఈ సినిమా దక్కించుకునేంతగా సక్సెస్ ను పొందింది. యూట్యూబ్ లో ఈ సినిమాను ఈ ఏడాది జనవరిలో హిందీలో డబ్ చేసి విడుదల చేయడం జరిగింది. తెలుగు సినిమాకు ఉత్తరాదిన మంచి ఆధరణ ఉంది. అల్లు అర్జున్ సినిమాలతో పాటు రామ్ సినిమాలు ఇంకా ఇతర హీరోల సినిమాలు యూట్యూబ్ లో అక్కడ సంచలన వ్యూస్ ను దక్కించుకున్నాయి.
ఈ సినిమా కూడా హిందీ వర్షన్ యూట్యూబ్ లో రికార్డు స్థాయి వ్యూస్ ను దక్కించుకుంది. ఇక ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీ కూడా యూట్యూబ్ లో సాధించని లైక్స్ ను ఈ సినిమా సాధించింది. రెండు మిలియన్‌ల లైక్స్ ఈ సినిమాకు రావడం అందరికి ఆశ్చర్యంగా ఉంది. తెలుగులో హిట్ కాలేక పోయిన ఈ సినిమా హిందీ ప్రేక్షకులకు అంతగా నచ్చడం ఏంటా అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి కారణంగా బాలీవుడ్ లో ఫాలోయింగ్ ఏర్పడినది. ఆ కారణం వల్ల కూడా కామ్రేడ్ సినిమాకు ఈ స్థాయి లైక్స్ వచ్చి ఉంటాయని బాలీవుడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక 160 మిలియన్ ల వ్యూస్ ను ఇప్పటి వరకు ఈ సినిమా దక్కించుకుంది. ముందు ముందు మరెంతగా ఈ సినిమా రికార్డులు సాధిస్తుందో చూడాలి.