ఇండస్ట్రీ లో తెలుగు హీరోయిన్లకు ఛాన్సులు రావని , ఎవరు ఇవ్వరని టాక్..కానీ ఈ మధ్య దర్శక , నిర్మాతల కళ్లు మన తెలుగు హీరోయిన్ల ఫై కూడా పడుతున్నాయి. తాజాగా సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన కొత్త చిత్రంలో తెలుగు అమ్మాయికి ఛాన్స్ ఇచ్చి తన గొప్ప మనసు చాటుకున్నాడు.
‘కరోనా వైరస్’ పేరిట వర్మ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణలో అగస్త్య మంజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 11వ తేదీన థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సినిమా ద్వారా దక్షి గుత్తికొండ అనే తెలుగమ్మాయి వెండితెరకు పరిచయమవుతోంది. ఈ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించింది. చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఆమె మాట్లాడుతూ..వర్మ కు థాంక్స్ తెలుపుతూ తన పాత్రకు సంబందించిన విశేషాలను తెలిపింది.
‘‘సోషల్ మీడియాలో ఉన్న నా గ్లామర్ ఇమేజ్‌కి సినిమాలో చేసిన రోల్‌కి అస్సలు సంబంధం ఉండదు. ఒక తెలుగు ఫ్యామిలీలో తమిళ కోడలిగా వంశీ చాగంటికి భార్యగా నేను కనిపిస్తాను. నా మొదటి సినిమాలోనే డీ గ్లామ్ క్యారెక్టర్ చెయ్యటం ఛాలెంజింగ్‌గా అనిపించింది. కరోనా టైంలో తెలుగమ్మాయి అయిన నాకు మొదటి సినిమా అవకాశం ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ గారికి ధన్యవాదాలు. ఇలాంటి పాత్రలే చెయ్యాలని నాకంటూ పరిమితులేమి పెట్టుకోలేదు. ఒకవేళ కథ నచ్చితే ఏ తరహా పాత్ర అయినా పోషిస్తాను. అలాగే కథ డిమాండ్ చేస్తే గ్లామర్, రొమాంటిక్ సీన్స్‌లో నటించడానికి కూడా సిద్ధమే’’ అని నిర్మాతలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. మరి ఈ ఆఫర్ ను ఎంత మంది వినియోగించుకుంటారో చూడాలి.