స్వయం కృషితో ఎదిగిన అతి కొద్ది సెలబ్రిటీల్లో చిరంజీవి పేరు ముందు వరుసలో ఉంటుంది. అతి సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి సినిమాల్లోకి వచ్చిన చిరు.. ఎంతో కష్టపడి సినీ రంగంలో మంచి స్థానానికి చేరుకున్నారు. ఆయన పడ్డ కష్టమే ఇప్పుడు ఆయనను అందలం ఎక్కించింది. మెగాస్టార్ ను చేసింది.
అందుకే చిరంజీవికి కష్టం విలువ తెలుసు. ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్ మరో హీరోకు లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన అభిమానులు ఆపదలో ఉంటే వెంటనే స్పందిస్తారు మెగాస్టార్. ఆయన మీద అభిమానులు ఎంత ప్రేమ చూపిస్తారో… చిరంజీవిక కూడా వారి మీద అంతే ప్రేమ చూపిస్తారు. ఇప్పటి వరకు ఎన్నో సాయాలు చేశారు. ఎందరికో గుప్త దానాలు చేసి తన మంచి గుణాన్ని చాటుకున్నారు.
తాజాగా శ్రీకాకుళం జిల్లా రాజాం పరిధిలోని కొండంపేటకు చెందిన కొండల రావు చిరంజీవికి పెద్ద అభిమాని. 30 ఏళ్లుగా టీ దుకాణం నిర్వహిస్తూనే… చిరంజీవి యువత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు కొండలరావు. అయితే అతని కూతురు నీలవేణి పెళ్లికార్డుపై చిరంజీవి దంపతులు, నాగేంద్ర బాబు, పవన్ కల్యాణ్ చిత్రాలు ముద్రించి మరో సారి తన అభిమానాన్ని చాటుకున్నాడు కొండల రావు.
ఈ విషయం కాస్తా చిరంజీవికి చేరడంతో.. తన వంతుగా చిరంజీవి కొండలరావుకు ఆర్థిక సాయం చేశారు. ఈనెల 10న జరగనున్న వివాహానికి కానుకగా కొండలరావు బ్యాంకు అకౌంట్ లో లక్ష రూపాయలు జమ చేశారు. ట్విట్టర్ ద్వారా పెళ్లి చేసుకోబోతున్న కొండలరావు కుమార్తెకు తన ఆశీస్సులు తెలిపారు. చిరంజీవి యువత సంఘం సభ్యులు మరో లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు. చిరంజీవి చేసిన ఆర్థిక సాయం పట్ల కొండలరావు స్పందిస్తూ.. తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.